Thursday 31 May 2012

సానుభూతి ఓట్లు పడుతాయా...........?



అక్రమ ఆస్తుల సంపాదనపై వై.యస్.ఆర్ . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు పాలు కావడాన్ని కూడా ఆ పార్టీ తన గెలుపుకు అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నది.  ముఖ్యంగా పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మీని, చెల్లెలు షర్మిలను ప్రచారానికి పంపడం కూడా హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదనిపిస్తుంది. ఎందుకంటే గత ఆరు నెలలుగా జగన్ అరెస్టు అవుతాడని అందరూ  ఊహించినదే. అయితే ఎప్పుడు అన్న విషయం మాత్రం అంచనా వేయలేకపోయారు. ముందు ఉపఎన్నికలు పెట్టుకొని అరెస్టు చేసే ధైర్యం చేయరేమోనని అంతా అనుకున్నారు.  అంతే గాక వై.యస్.ఆర్ పార్టీ వారు ఇచ్చిన స్టేట్ మెంట్లు కూడా భయపెట్టేటట్టు చేసింది. జనంలో తిరుగుబాటు వస్తుందని, జగన్ పై ఒక చేయి వేస్తే లక్షల చేతులు లేస్తాయని ప్రగల్బాలు పలికారు. తీరా అరెస్టయ్యాక జనంలో ఆశించినంత మేర స్పందనలేదు. అవినీతిని ప్రోత్సహించకుండా మద్ధతు ఇవ్వకుండా జనం మంచి పనే చేశారనిపిస్తోంది. చివరికి జగన్ ఇంటిలోని వారే తప్పనిసరి పరిస్థితిలో జనంలో సెంటిమెంట్ పండించేందుకు ఆయన తల్లి స్వయంగా ధర్నాకు దిగారు. జనంలో స్పందన లేకపోగా జగన్ చేసిన పనికి వారి ఇంటిలో వారు కూడా వత్తాసు పలుకుతున్నారనే భావన పెరిగిపోతోంది.
ఇప్పుడు ప్రచారానికి కూడా తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిల దిగారు. జనం బాగానే వచ్చినా అవినీతికి అనుకూలంగా ఓటువేస్తారా లేదా వేచి చూడాలి. సెంటిమెంట్ ఉండి ఉంటే సామాన్యుడు ఇంత వరకూ వేచి ఉండే వాడు కాదు. మన ఆంధ్ర ప్రదేశ్ లో 1984 లో యన్.టిఆర్ ను పదవీనుంచి గవర్నరు భర్తరప్ చేసినప్పుడు జనం ఆయనకు పలికిన మద్ధతు వల్లే నెల తిరగకుండానే తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు. అదే యన్.టి. రామారావు లక్ష్మీ పార్వతి కారణంగా చంద్రబాబు తిరుగుబాటు చేసి పదవినుంచి తొలగిస్తే అదే విధంగా పోరాటం చేస్తే జనంలో స్పందన కరువైంది. అదే విధంగా ఇప్పుడు రాజశేఖర్  రెడ్డిపై ఉన్న అభిమానం జగన్ అరెస్టు వల్ల అవినీతి మచ్చ అంటడంతో తగ్గుముఖం పడుతోంది.  ఉప ఎన్నికలలో జగన్ పార్టీకి ముందు ఊహించిన దానికన్నా సీట్లు తగ్గుతాయని మాత్రం అందరూ అంటున్న మాటే. చూద్దా జనం తీర్పు ఎలా ఇస్తారో...