Sunday 17 June 2012

భ్రమించిన బి.జె.పి కి భంగపాటు


దక్షిణ భారత దేశంలో అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పట్టు నిలుపుకోవాలనుకున్న బి.జె.పి కి పరకాలలో ఓటమితో భంగపాటు జరిగింది. ఇంతకు మునుపు మహబూబ్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికలలో టి.ఆర్.యస్ పై గెలిచి తెలంగాణా సాధన మాకే సాధ్యమని, తమది జాతీయ పార్టీ అని, ఇది వరకే మూడు రాష్ట్రాలు ఇచ్చిన చరిత్ర చూసి జనం తమను గెలిపించారని బి.జె.పి భావించింది. అంతేగాక పరకాలలో టి.ఆర్.యస్ తో సంబంధాలు బెడిసి కొట్టడంతో జె.ఏ.సి మద్ధతు ఇవ్వకపోయినా పరకాలలో తామే గెలుస్తామని బీరాలు పలికింది. ఈ పరకాలలో పాగా వేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడే తిష్టవేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు కూడా. అంతేగాకుండా జాతీయనాయకురాలైన సుష్మా స్వరాజ్ ను రప్పించి బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే 12న జరిగిన ఉప ఎన్నికలలో పోటీ ప్రధానంగా టి.ఆర్.యస్ కు వై.యస్. ఆర్ పార్టీలకు మధ్యే సాగడంతో బి.జె.పి కి పరాజయంతో పాటు పరాభవం మిగిలినదనే చెప్పాలి.

ఈ గెలుపు వాపా ? బలుపా?



పలు రకాల అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జగన్ జైలు పాలయినా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలలో గెలుపొంది రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు కొందరికి ఖేదం కాగా మరికొందరికి మోదం అవుతున్నది. ఈ ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి అని, విస్వసనీయతకు, అవిస్వనీయతకు మధ్య పోరని పలు రకాలుగా ఎన్నికలకు ముందు వివిధ రకాల పార్టీలు ప్రచారం చేసుకున్నా ఓటరు దేవుడు వై.యస్.ఆర్ పార్టీకే ఓటు వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, టి.ఆర్.యస్ లు ఈ ఫలితాలను జీర్ణించుకోలేపోతున్నాయి. ఈ ఫలితాలు కేవలం సానుభూతి పవనాల వల్ల వచ్చిందని, విజయమ్మ, షర్మిల కన్నీరు వల్ల వచ్చిందని సమాధానం చెప్పుకుంటున్నాయి . కాని వాటితో పాటు ఈ పాలక, ప్రతి పక్షాలు చేసిన పొరపాట్లే జగన్ పార్టీ జైత్రయాత్రకు సోపానాలయ్యాయి.  కాంగ్రెస్ పార్టీ  అంటున్నట్టు కర్ణుడి చావుకు కారణాల లాగా ఈ క్రింది కారణాలు అటు జగన్ కు తోడ్పడగా కాంగ్రెస్ కు తెలుగుదేశం ల పరాజయానికి కారణాలయ్యాయు
  • ఎఫ్.ఐ.ఆర్ లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి పేరు వ్రాసినందులకు రాజీనామా చేసినప్పుడు, అందుకు నిరసన వ్యక్తం చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి తమ వాడేనని ఆయన తప్పు లేదని తొలుత కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఉప ఎన్నికలు మొదలు కాగానే వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా ముద్దాయేనని తెరవెనుక లాలూచీలు జరిగాయని విమర్శించాయి.
  • ఎ.సి.బి .ద్వారా మధ్యం సిండికేట్ల పై ఎ.సి.బి దాడులు జరుగడం . అందులో బొత్స సత్యనారాయణ పై ఆరోపణలు రావడం. ఈ కేసులో మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన పై పలు ఆరోపణలు రావడం, బొత్స సత్యనారాయణ అధిష్టానంతో చర్చించిన మీదట ఆయనపై ఎలాంటి విచారణ జరుపకపోగా ఎ.సి.బి. అధికారి శ్రీనివాస్ ను అకస్మాత్తుగా ప్రమోషన్ పై బదిలీ చేయడం. కొద్దిరోజుల వ్యవధిలో అడిషనల్ డి.జి.పి అధికారి పై  ఇంకో అధికారిని నియమించి ఆయన అధికారాలకు కత్తెర వేయడం
  • ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ల మధ్య సమైక్యత లేకపోవడంతో వాయలార్ రవి రావలసి రావడం.
  • సాక్షి మీడియా అకౌంట్లను సీజ్ చేయడం దానిపై పత్రికా స్వేచ్చని ప్రచారం జరిగి జగన్ ను అణగద్రొక్కడానికి కుట్ర చేస్తున్నట్టు జనం నమ్మడం
  • సి.బి.ఐ జగన్ ను ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక అరెస్టు చేయడం , ముందుగానే అరెస్టు చేసి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వేరేగా ఉండేవి.
  • ఎన్నికల ముందురోజు కావాలనే దొంగల బండి ఎక్కించడం దానిపై సాక్షి టి.వి కధనాలు అంతకు ముందు అవినీతి పై అరెస్టు అయిన వ్యక్తి గురించి మీడియా ఎక్కువ ప్రచారం కల్పించడం.
  • టి.ఆర్.యస్ . బి.జె.పి పై దృష్టి పెట్టి వై.యస్.ఆర్ పార్టీని పెద్దగా పట్టించుకోకుండా ఆ పార్టీకి సానుకూలంగా వ్యవహరించి చివరి నిమిషంలో విమర్శలు చేయడం. అంతకు ముందే టి.ఆర్.యస్ , జగన్ పార్టీలు కుమ్ముక్కయ్యాయని ప్రచారం చేయడం.
  • తెలుగుదేశం అధినేత జనంలో విస్తృతంగా తిరిగినా జనం సమస్యలపై పోరాడకుండా కేవలం అవినీతి పైననే మాట్లాడటం, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉప ఎన్నికలలో పట్టుదలగా పనిచేయకపోవడం
  • వై.యస్.రాజశేఖర్ రెడ్డి పై జనంలో ఇంకా ఉన్న ఇమేజ్ ప్రధాన కారణంగా ఉంది. ఆయన చావును మళ్ళీ చర్చించి పదే పదే ఆ దృశ్యాలను చూపడం , సాక్షి టీ.వీ , పేపరులో కథనాలు  , ప్రభుత్వం పై , ప్రతిపక్షం పై అవినీతి కథనాలు ప్రచురింపడం వై.యస్.ఆర్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాస్తులపై కేసు వేస్తే దానిపై సి.బి.ఐ స్పందించిన తీరు , అలాగే చంద్రబాబు స్టే తెచ్చుకోవడం దీనివల్ల ఎవరు అవినీతి చేయలేదనే అభిప్రాయం ప్రబలింది.
  • ప్రజారాజ్యం పార్టీ ఓట్లన్ని చిరంజీవి ఇమేజ్ తగ్గుముఖం పట్టడంతో అది జగన్ కు బదిలీ కావడం. ఎన్నికలు కొద్దిరోజులు ముందే చిరంజీవి కూతురు ఇంటిలో కోట్లాది రూపాయల నగదు ఐ.టి. అధికారులకు పట్టుబడటం. దానిపై వై.యస్.ఆర్ పార్టీ ప్రచారాన్ని జనం నమ్మడం.
  • ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సక్రమంగా లేకపోవడం. సరైన ఇమేజ్ ఉన్న నాయకత్వం లేకపోవడం, కరెంటు కోతలు, విద్యుత్ చార్జీలు పెంపు, పెట్రోలు ధరల పెంపు, వ్యాట్ పెంపు లతో పాటు వేసవిలో నీటి ఎద్దడి మరియు నిత్యావసరాల వస్తువుల ధరలు అమాంతగా పెరగడం
  • ప్రభుత్వంలో ని దాదాపు ఆరేడుమంది మంత్రులు కూడా అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నప్పుడు కేవలం ప్రభుత్వం జగన్ నే విమర్శించడం . కేవలం మోపిదేవినే అరెస్టు చేసింది జగన్ అరెస్టుకే నని జనం నమ్మడం
  • కోర్టు ఆదేశాల మేరకే జగన్ అరెస్టు జరిగిందని కాకుండా ఆ కేసుల విచారణ కేవలం కాంగ్రెస్ అధిష్టానం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేసిందని ,. ఓదార్పు యాత్ర చేయడం వారికి ఇష్టం లేదని ప్రచారం జరుగడం.
  • వీటితో పాటు జగన్ అరెస్టయిన సందర్భంలో వారి తల్లి విజయమ్మ, షర్మిల ల ప్రచారం , వారు చేసిన ఆరోపణలు , వారి కన్నీటి పట్ల జనంలో సానుభూతి పెల్లు బికడం లాంటివి కూడా బాగా తోడ్పడ్డాయి.
జగన్ గెలుపు బలం కాదని కేవలం వాపని కొందరు అంటున్నారు. ఇది పాల పొంగని కేవలం ఈ ఎన్నికలకే పరిమితమని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు చేసిన వివిధ పొరపాట్లు జగన్ నెత్తిన పాలు పోసినట్టే ఇలాగే కొనసాగితే 2014 లోనూ ఆ పార్టీలకు పరాభవం తప్పదు. 

Friday 15 June 2012

జగన్ పార్టీ జయకేతనం



అందరూ ఊహించినట్టే జరిగింది. 12 వతేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వై.యస్.ఆర్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 మరియు ఎన్నికలు జరిగిన ఒకే ఒక లోకసభ స్థానంలోనూ ఆపార్టీ గెలుపొందడం జరిగింది. అదే విధంగా తెలంగాణా ప్రాంతానికి చెందిన పరకాలలో కూడా తృటిలో ఓడినా గెలిచినంత పనిచేసి టి.ఆర్.యస్ కు చుక్కలు చూపించింది. జగన్ పార్టీ గెలుపుపై ఎవరికీ సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీ నిలబెట్టిన వారంతా సిటింగ్ యం.ఎల్.ఏలు . అయితే వాటిలో అన్ని స్థానాలు గెలిచి సత్తా చాటాలని ప్రయత్నించినా కాంగ్రెస్ రెండు స్థానాలలో అడ్డుకోగలిగింది. అలాగే తెలుగు దేశం దాదాపు 10 స్థానాలలో కాంగ్రెస్ కన్నా ముందున్నా ఒక సీటు కూడా దక్కలేదు. ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఆశనిపాతమే.  ఈ ఎన్నికల అంశంగా మారిన జగన్ అవినీతి కన్నా ఆయనను అరెస్టు చేయడం తల్లి, చెల్లి, కన్నీరు, లాంటి సానుభూతి అంశాలు ఎక్కువగా పనిచేశాయి. దీనికి ఉదాహరణగా పరకాలను చెబుతున్నారు. టి.ఆర్.యస్ సులభంగా ఎక్కువ మెజారిటీతో గెలవాలసిన స్థానంలో చెమటోడ్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సానుభూతి పవనాల వల్లే ప్యాన్ గుర్తుకు అన్ని ఓట్లు పడ్డాయని టి.ఆర్.యస్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ జైలులో ఉన్నా ఆ పార్టీ గెలుపొందడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి ఇదే సానుకూలంగా ఉపయోగపడిందని వేరే చెప్పనక్కరలేదనుకుంటా..

Thursday 14 June 2012

ఫలితాలు పై ఎవరి ధీమా వారిదే...


రాష్ట్రంలోని 12 జిల్లాలో ఇటీవల 12 వతేదీన జరిగిన ఉప ఎన్నికలలో గెలుపు తమదంటే తమదని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి 18 స్థానాలు, పార్లమెంటుకు 1 స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గెలిస్తే ఏమని చెప్పాలి, ఓటమి పాలయితే ఏ విధంగా బురద జల్లాలి అని కూడా పార్టీలు తమ నాయకులకు తగిన శిక్షణలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలలో అందరి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తారని భావిస్తున్న వై.యస్.ఆర్ పార్టీ కూడా 4-5 స్థానాలలో గట్టి పోటీని ఎదుర్కోన్నట్టు భావిస్తూ ఒక వేళ అక్కడ ఓటమి చెందితే పాలక ప్రతిపక్షాలు కలసి కుట్ర పన్నట్టు ప్రచారం చేయనున్నాయి. అలాగే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్టు ప్రచారం నిర్వహించేందుకు సిద్దమవుతున్నది. అలాగే గెలిస్తే వై.యస్.రాజశేఖర్ రెడ్డి పై జనంలో ఉన్న అభిమానానికి తార్కాణమని, జగన్ ప్రభంజనమని అంటూ ప్రచారం చేయనున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గెలుపు పై పెద్దగా ఆశలు లేవనే చెప్పాలి. ఒక వేళ రెండు మూడు స్థానాలలో గెలిచినా చాలని భావిస్తున్నది. మిగిలిన స్థానాలలో ఓడితే సెంటిమెంట్ పండిందని, విజయమ్మ, షర్మిలల కన్నీటికి జనం కరిగి పోయారని ప్రచారం చేసుకుంటుంది. ఆ పార్టీ నాయకుడు చిరంజీవి అయితే మొత్తం ఓడినా కనీసం తిరుపతి లో గెలిస్తే చాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలా గెలిస్తే తనకు కేంద్ర మంత్రి పదవిని కోరవచ్చు. మిగిలిన స్థానాలు ఎలాగు జగన్ అరెస్టు సానుభూతి అంటూ ప్రచారం చేసుకోవచ్చు.

ఇక తెలుగుదేశమయితే ఈ ఎన్నికలలో డబ్బు వరదై పారిందని కాబట్టే జగన్ పార్టీ గట్టేక్కిందని ఓడితే గట్టిగా ప్రచారం నిర్వహించబోతోంది. మీడియా సాక్షీ ప్రచారం కూడా దీనికి తోడయిందని చెప్పవచ్చు. కనీసం ఆ పార్టీ మూడు స్థానాలు గెలిచినా తల ఎత్తుకుని తిరగవచ్చని భావిస్తున్నది.
ఇక మిగిలిన బి.జె.పి, టి.ఆర్.యస్ పార్టీలు తెలంగాణా అంశం పై పోటీ చేసినా కొండా సురేఖను ఓడిస్తేనే అది ఉన్నట్టు తేలుతుంది. అయితే ఎవరు ఎక్కడ గెలిచినా మెజారిటీ బోటాబోటీగానే ఉండవచ్చు. వై.యస్.ఆర్ పార్టీ అటు కాంగ్రెస్ ఓట్లకు, ఇటు వ్యతిరేక ఓట్లకు భారీగా గండికొట్టి ఇరు పార్టీలపై సమర శంఖం పూరించిందనే చెప్పాలి.  అయితే ఈ ఎన్నికల ఫలితాలే 2014 లో వస్తుందని మాత్రం చెప్పడం కష్టం అప్పటికి రాజకీయంగా చాలా ఎక్కువ సమయమనే చెప్పాలి. మా అంచనా మేరకు అయితే వై.యస్.ఆర్ పార్టీ 9-12 స్థానాలు, కాంగ్రెస్ 3-4 స్థానాలు, తెలుగుదేశం 2-4 స్థానాలు గెలువవచ్చని భావిస్తున్నాము. 20 శాతం ఓటర్ల మనోగతం ఎవరికీ అంతు చిక్కలేదు. వారు వేసే ఓటుపై ఫలితాలు అటు ఇటు మారవచ్చు కూడా. చూద్దాం రేపు మద్యాహ్నం లోపు ఫలితాలు ఎటూ రానున్నాయి.  

Tuesday 12 June 2012

పార్టీల గుండెలో గుబులు


పోలింగు సరళి
జరుగుతున్న ఉప ఎన్నికలలో పోలింగ్ సరళి మందకోడిగా సాగుతోంది. మద్యాహ్నం నుంచి పోలింగ్ వేగం పుంజుకోవచ్చని భావిస్తున్నారు. ఓటుకు నోటు అంటూ డబ్బలు కుమ్మరిస్తున్న పార్టీలకు గెలుపు పై వారి వారి భయాలు వారికి ఉన్నాయి. ఓడిన వారూ పైకి ఏడిస్తే, గెలిచిన వాడు కుమిలి కుమిలి ఏడవ్వాలి. పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకునే మార్గాలపై అన్వేషణ సాగిస్తారు. 




ఫలితాలపై పార్టీలలో గుబులు
ఏది ఏమైనా ఈ ఎన్నికలు అధికార పక్షానికి మరియు వై.యస్.ఆర్ పార్టీకి చావో రేవో తేలుస్తాయి. ఎవరు గెలిచినా ఎవరూ ఓడినా ఓడిన వారి పని ఇక అయిపోయినట్టే. కాంగ్రెస్ ఓడితే ఆస్థానంలోకి వై.యస్.ఆర్ కాంగ్రెస్ ఆక్రమిస్తుంది. ఇప్పుడే యం.ఎల్.ఎ లు  ఎప్పుడెప్పుడు జంపు అవుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈ జంపింగ్ కార్యక్రమం ఫలితాలు వెలువడిన వెంటనే మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి పదవికి లేదా బొత్స పదవికి , చిరంజీవికి ఇస్తామన్న కేంద్ర మంత్రి పదవికి ఈ ఎన్నికల ఫలితాలు లింకు ఏర్పడి ఉంది. అలాగే గొంతుల వరకు అవినీతి, అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ కు ఈ ఫలితాలు అనుకూలంగా వస్తే పార్టీ పరంగా మానసిక బలం పెరుగుతుంది. ఫలితాలు అనుకూలించకపోతే రాజకీయంగా పార్టీ పతనం చెందడం ప్రారంభిస్తుంది. తెలుగుదేశం పార్టీది అయిదే వింత సమస్య . ఫలితాలు అనుకూలిస్తే 2014 పై ఆశలు చిగురిస్తాయి. లేదంటే ఎన్టీఆర్  కుటుంబ సభ్యుల ప్రవేశం (బాలయ్య) త్వరగా జరుగుతుంది. అంతే గాక రాబోయే 2014 ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను, నాయకులను అట్టి పెట్టుకోవడం పెద్ద సమస్య.  తెలంగాణాలో అయితే బి.జె.పి. , టి.ఆర్.యస్ ల మధ్య ఆధిపత్య పోరుకు కూడా వేదికగా నిలిచిన ఈ ఎన్నికల ఫలితాల   అన్ని పార్టీల గుండెల్లో గుబులు రేపుతోందని చెప్పక తప్పదు. 

Monday 11 June 2012

బయ్యారం గనుల లీజు రద్దు చేసిన ప్రభుత్వం


వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన స్వంత అల్లుడు బ్రదర్ అనిల్ కు  కట్టబెట్టిన 1,45,000 ఎకరాల బయ్యారం ఇనుప గనుల లీజును ప్రభుత్వం నేడు రద్దు చేసింది. 2008 లో ఈ గనులు తమకు కేటాయించాలని చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నా ఖాతరు చేయకుండా ఎలాంటి జంకు గొంకు లేకుండా స్వంత అల్లుడికి గనులు కట్టబెట్టడం పై అప్పుడే పెద్ద ఎత్తున్ నిరసనలు వెల్లు వెత్తాయి. అయినా రాజశేఖర్ రెడ్డి మొండి వైఖరితో వాటిని రద్దు చేయలేదు. మారిన రాజకీయ పరిస్థితులలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ ప్రత్యర్థులుగా మారిన తరుణంలో ప్రతిపక్షాలు సంధించిన విమర్శలను తట్టుకోలేక కిరణ్ సర్కారు ఎట్టకేలకు బయ్యారం గనుల లీజును రద్దు చేసింది.  ఇటీవల ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ప్రచారంలో కాంగ్రెసుకు ముచ్చేమటలు పోసాయి. ప్రతిపక్షాలు ఆమె కుటుంబానికి చెందిన బయ్యారం గనుల విషయమై పదే పదే విమర్శలు చేశాయి. అయితే వీటిపై ఆమె ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు కదా.. ఎదుటి వారిని విమర్శించడానికే పరిమిత మయుంది. ఎన్నికల ప్రచారం పూర్తికావడంతోనే ప్రభుత్వం లీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని కూడా ఖచ్చితంగా కక్షసాధింపు చర్యగా ప్రచారం చేసుకుంటారేమో చూడాలి మరి.

నిరాహార దీక్ష చేస్తానని జడ్జీనే బెదిరించిన జగన్


రోజూలా కాకుండా తనను కోర్టుకు అందరి ఖైదీల్లా సాధారణ పోలీసు వ్యానులో తీసుకువచ్చినందులకు జగన్ సహనం కోల్పోయాడు. తనను అవమానిస్తున్నారని తాను యం.పి నని, ఒక పార్టీకి అధ్యక్షుడినని తన భద్రత గాలికొదిలి ఇలా సాధారణ ఖైదీలా తీసుకురావడం పై జగన్ జైలులో జడ్జీకి ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా తనకు పూర్వపు సౌకర్యాలు కల్పించకుంటే తాను నిరహారదీక్ష చేపడుతానని కూడా జడ్జీని బెదిరించారు. వెంటనే జడ్జీ ఆదేశాలతో జగన్ బుల్లెట్ ప్రూప్ వాహనాన్ని సిద్దంచేయక తప్పింది కాదు సి.బి.ఐ .కి . ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడు ఈ విధంగా తన సౌకర్యాల కోసం గళం ఎత్తడం , కోర్టులో ఏకంగా జడ్జీని ఒక రకంగా బెదిరించడాన్ని జగన్ వైఖరికి నిదర్శనంగా ప్రత్యర్థ పార్టీలు చెబుతున్నాయి. కోర్టులు కూడా ఖైదీల బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు గురయితే ఇంక చేసేది ఏముంది. ఇదే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఖైదీలు ఎవరయినా సౌకర్యాలు అడిగితే సమకూర్చగలరా అని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల ముందు జగన్ తనను సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు చేయడం కూడా ఎత్తుగడలో భాగమని కొందరు అంటున్నారు.

జగమొండి జగన్ : నార్కో పరీక్షలకు సి.బి.ఐ. పిటీషన్


అక్రమాస్తుల కేసులలో సి.బి.ఐ .కస్టడీలో విచారణను ఎదుర్కోన్న జగన్మోహన్ రెడ్డి పొంతనలేని విధంగా మరియు సరైన సమాధానాలు చెప్పలేదని సి.బి.ఐ వాదిస్తోంది. సరైన సమాధానాలు చెప్పించడానికి గాను నార్కో పరీక్షలకు అనుమతి కోరుతూ సి.బి.ఐ కోర్టులో సి.బి.ఐ పిటీషన్ వేసింది. విదేశాల నుండి తన కంపెనీలలోకి పారిన నిధుల వివరాలను ఏమీ అడిగినా తెలియదనే సమాధానం చెప్పారని తెలుస్తోంది. అలాగే ఏది అడిగినా తన ఆడిటర్ విజయసాయిరెడ్డిని అడుగమని చెప్పినట్టు అంటున్నారు. అక్రమాస్తులు సంపాదించలేదని, కేసు అక్రమంగా బనాయించారని తాను నిర్దోషినని వాదించుకునే అవకాశం ఉన్నాఆ విధంగా మాట్లాడలేకపోవడానికి ఇప్పటికే సి.బి.ఐ సేకరించిన సాక్ష్యాలతో ఏమి చెబితే ఏమి నెత్తికొస్తుందోనని మొండికేస్తున్నట్టు తెలుస్తున్నది. జగన్ తన నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. చూద్దాం ఏమి చేయనున్నారో.. ఈ కేసును సి.బి.ఐ కోర్టు ఈ నెల 14 వతేదికి వాయిదా వేసింది. ఆ రోజు నార్కో పరీక్షలకు అనుమతి ఇవ్వలా వద్దా తీర్పు చెప్పనున్నారు. అయితే జగన్ తరపున న్యాయవాదులు ఇలాంటి పరీక్షలకు అనుమతిని ఇవ్వవద్దని పిటీషన్ వేయడం జరిగింది. మొత్తానికి విజయసాయిరెడ్డి జగన్ కు మంచి శిక్షణే ఇచ్చి సి.బి.ఐ అధికారులు సహనానికి పరీక్షలు పెడుతున్నట్టే..

Saturday 9 June 2012

నేటితో ముగియనున్న ప్రచారం



 రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పార్టీల భవిష్యత్తును నిర్ణయించే ఉపఎన్నికలకు ప్రచారం నేటితో తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ లో 18 అసెంబ్లీ, 1 లోకసభ స్థానానికి ఎన్నికలు జూన్ 12న జరుగనున్న విషయం విదితమే. ఎన్నికలు జరుగుతున్న  నెల్లూరు లోకసభకయితే పోటీ నువ్వా నేనా అని ఉంది. ఇక్కడ ఎన్నికలకు అభ్యర్థులు పెట్టే ఖర్చే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరకాల ఉప ఎన్నిక తెలంగాణాలో జరుగుతున్నది. ఇక్కడ బహు ముఖంగా ఉంది. ముఖ్యంగా వై.యస్.ఆర్ అభ్యర్థి కొండా సురేఖ ఎదురీదుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడ పాగా వేయాలని టి.ఆర్.యస్ మరియు బి.జె.పిల మధ్యే ప్రదాన పోటీ నెలకొని ఉంది. తెలుగుదేశం పరిస్థితి ఏ మాత్రం తెలంగాణాలో మెరుగుపడలేదు. అలాగే సీమాంధ్రలో జరుగుతున్న 17 అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా పోటీ వై.యస్ ఆర్ కాంగ్రెస్ , తెలుగు దేశం , కాంగ్రెస్ ల మధ్య త్రికోణ పోటీ నెలకొని ఉంది. చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతి స్థానం అయితే తెలుగుదేశంకు లాభించేలా ఉంది. అక్కడి ప్రజారాజ్యం పార్టీ తరపున ఇంతకు ముందు గెలుపొందిన చిరంజీవిపై అలాగే కరుణాకర రెడ్డి పై తీవ్ర అసంతప్తి నెలకొని ఉంది. ఇది సహజంగా తెలుగుదేశంకు లాభిస్తుందని భావిస్తున్నారు. మిగిలిన స్థానాలలో వై.యస్.ఆర్ పార్టీకి సానుభూతి పవనాలు వీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో ఎన్ని ఎవరు గెలుస్తారో చెప్పటం కష్టంగా మారింది. ఎందుకంటే వై.యస్.ఆర్ పార్టీ భారీగా కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి కొట్టనుంది. అలాగే తెలుగుదేశం ఓట్లు కూడా చీలితే ఆ ప్రభావం వై.యస్.ఆర్ పార్టీకి భారీగా లాభిస్తుంది. అయితే తెలుగుదేశం ఓట్లు చీలకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ పంట పండినట్టేనని భావిస్తున్నారు. తిరుపతి మినహా ఎన్నికలు జరుగుతున్న అన్నిస్థానాలలో పదవిలో ఉన్న వారే పోటీ చేస్తుండడంతో వారిపై జనంలో ఉన్న ఆబిమానం మరియు వై.యస్ ఆర్ పార్టీ పట్ల ఉన్న అభిమానానికి ఈ ఎన్నికలు ఒక పరీక్షగా నిలువనున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టుకావడంతో ఫలితాలు ఎలా మారుతాయోనని అన్ని పార్టీలలో గుబులు ఏర్పడింది. ఆ పార్టీ తరపున విజయమ్మ, షర్మిల ప్రచారం ఆ పార్టీని ఈ ఎ న్నికలలో గెలుపు దిశగా పయనింపజేస్తున్నదని చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో అప్పుడే ఓటమికి సిద్ధమైన సూచనలు కనబడుతున్నాయి. ఈ ఎన్నికల తరువాత యం.ఎల్.ఏ లు పార్టీ ఫిరాయించకుండా ఎలా అడ్డుకోవాలనే దానిపైననే మదనపడుతోంది.   రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం ఈ ఎన్నికలు మాత్రం పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం చెప్పవచ్చు. ఓటరు మహాశయుడు ఏ చేస్తాడో చూద్దాం.

ప్రభుత్వ భవన వసతిని వద్దన్న సచిన్




క్రికెట్ ఆటగాడు సచిన్ రాజసభ సభ్యుడిగా ఇటీవల ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడి (యం.పి) గా అతనికి భవన వసతిని ప్రభుత్వం కల్పిస్తుంది. అందులో భాగంగా సచిన్ టెండూల్కర్ కు రాహుల్ గాంధీ నివాసముండే భవనానికి ఎదురుగానే అయిదు పడకల విశాలమైన భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే తాను ఢిల్లీలో రాజ్యసభ సమావేశాలప్పుడు తప్పించి ఉండడం లేనని దీనికోసం ప్రత్యేక భవనం కేటాయించడం వల్ల ప్రజాధనం వృధా చేయడం తనకు ఇష్టలేదని తిరస్కరించాడు. ఢిల్లీకి వచ్చినప్పుడు తాను హోటల్లోనే ఉంటానని తెలిపాడు. సచ్చీలుడీగా పేరొందిన సచిన్ రాజకీయాలలో కూడా తనదైన ఒరవడిని నెలకొల్పడం మంచిదే. చాలామంది యం.పి గా ఎంపికయిన వెంటనే ఢిల్లిలో తమకోసం ఓ ఇల్లు తీసుకోవడం పదవీ పోయిన తరువాత కూడా దానిని ఖాళీ చేయకపోవడం నిత్యం చూస్తున్నదే. ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తనంత తానుగా సచిన్ ఈ విధంగా ప్రకటించడం మంచి పరిణామం. 

Friday 8 June 2012

పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పరకాల పోరు


తెలంగాణా సెంటిమెంటుకోసం పరకాల స్థానంలో కాంగ్రెస్ శానససభ్యురాలిగా ఉండిన కొండా సురేఖ రాజీనామా చేయడంతో పరకాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తెలంగాణాలో జరుగుతున్న ఒకే ఒక స్థానమైన పరకాల వివిధ పార్టీల బలబలాలను తేల్చనుంది. కాంగ్రెస్ తరపున శాసనసభ్యురాలిగా ఉండి రాజీనామా చేసినా మారిన రాజకీయ పరిస్థితులలో కొండా సురేఖ వై.యస్ ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పాలమూరు విజయం తరువాత బి.జె.పి కూడా పరకాల స్థానం ఎలాగయినా కైవసం చేసుకోవాలని శక్తి వంచన లేకుండా కష్టపడుతోంది. అయితే బి.జె.పి గెలిస్తే తెలంగాణాలో తన ఉనికి కే ప్రమాదం అవుతుందన్న అభద్రతా భావంతో ఉన్న టి.యస్.ఆర్ పార్టీ ఎలాగయినా ఈ ఎన్నికలు గెలిచి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నది. ఈ పార్టీకి జే.ఎ,సి కూడా మద్ధతు ప్రకటించింది. ఇక తెలుగుదేశం పార్టీ కి ప్రచారం నిర్వహించుకుంటున్నా గెలుపు పై ఎలాంటి ఆశలు లేవనే చెప్పాలి. పరకాల పోరులో బి.జె.పి, టి.ఆర్.యస్ లు నువ్వా నేనా అన్నంతగా పోటీ పడుతున్నాయి. దీని వల్ల తెలంగాణా సెంటిమెంటు ఓటు చీలితే అది వై.యస్ .ఆర్ పార్టీకి గాని తెలుగు దేశం పార్టీకి గాని లాభించే అవకాశం ఉంది. ఇక్కడి నుండి గెలువడం కొండా సురేఖకు  ఆమె పార్టీకి తప్పని సరి. ఎందుకంటే తెలంగాణాలో తమ పార్టీ మనుగడకు అది అవసరం అని భావిస్తుండడంతో నేడు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలైన విజయలక్ష్మీ కూడా తన కూతురు షర్నిలతో కలసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అవినీతి కేసులలో జగన్ జైలు పాలుకావడంతో వీరి ప్రచారం సెంటిమెంటును పండిస్తుందని ఆ పార్టీ వారు భావిస్తున్నారు. అలాగే బి.జె.పి గెలుపు పై ఆశాభావంతో ఉంది. తమది జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణా తమ వల్ల సాధ్యమవుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. టి.ఆర్.యస్ పాలమూరు లో అపజయంతో డీలా పడిపోయింది. ఎలాగయినా పరకాలలో గెలిచి తమ సత్తా చాటాలని ఉవ్విలూరుతున్నారు. తెలుగు దేశం అసలు గెలుపై ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా ప్రచారం మాత్రం పోటా పోటీ గా చేసుకుపోతున్నది. మొత్తానికి అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. చూద్దాం పరకాల ఓటరు ఎలాంటి తీర్పు నిస్తాడో మరి. 

అవినీతిని ఎంతవరకు సహించవచ్చు...



మనం అవినీతి సమాజంలో నివసిస్తున్నాం. ఎవరినయినా అవినీతి పరుడివి అంటే వెంటనే నీవు పెద్ద నీతి పరుడివా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న సమాజంలో బతుకుతున్నాం. బతుకడం కోసం చిన్న చిన్న స్థాయిలలో అవినీతి ఉందంటే కడుపాకలి అని సరిపెట్టుకోవచ్చు. కాని ప్రసుత్తం జరిగిన లేదా జరుగుతున్న అవినీతి మొత్తం సమాజాన్నే కలుషితం చేసే విధంగా ఉంది.  బతుకడం కోసం కొందరు మహిళలు శరీరాలు అమ్నుకొంటున్నారని అనుకుందాం అది తప్పని సరైన స్థితిలో వారుచేస్తున్నవిగా అర్థం చేసుకుని పునరావాసం కల్పించడమో లేక చూసిచూడనట్లు ఉండడమో జరుగుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన తారా చౌదరి లాంటి వారు అంతకు మించి పోయారు. పడుపు వృత్తితో పాటు బ్లాక్ మెయిల్ చేయడం, అమ్మాయిలను అడ్డదారులు త్రొక్కించడం లాంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అయినా చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆ అమ్మాయిని ఈ రంగంలో ఉపయోగించుకున్నారనే విషయాన్ని చర్చించుకుని యోవగించుకున్నారు. టి.వి ఛానళ్లు తారా చౌదరిని పదే పదే చూపుతుంటే ఎగబడి చూసిన జనమూ ఉన్నారు. ఆమెను అరెస్టు చేసినప్పుడు ఎలాంటి భయం లేకుండా పెద్ద ఘనకార్యం చేసినట్టుగానే  పోజులు ఇచ్చింది. ఇదే విధంగా  అవినీతి చిన్న స్థాయిలో ఉండి బతుకడానికి చేస్తున్నదయిచే కొంత వరకు క్షమించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఉండి, ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన అధికారాన్ని అమ్ముకుని కోట్లు కూడేసుకున్న పెద్ద మనుషులకు తారా చౌదరికి పెద్ద తేడాలు లేవు. దీని పై అడ్డంగా వాదించే వారు అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే . మనకు తోచిన స్థాయిలో మనం అవినీతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే అదే పెద్ద ఉద్యమంగా మారగలదు. అన్న హజారే ఈ విషయమై చేసిన ఉద్యమం జాతి యావత్తు ఒక్క తాటిపై నిలిపింది. అవినీతికి వ్యతిరేకంగా ఎవరయినా మాట్లాడితే వారు చేయలేదా , వీరు చేయలేదా అని ప్రశ్నించకుండా అవినీతిని రూపుమాపేందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం. అది రాజకీయమైనా ఇంకో స్థలమయినా చివరికి ఆ భారం పడేది సామాన్యులపైననే అని వివరిద్దాం. 

Thursday 7 June 2012

రాజీనామా చేసి మళ్ళీ పోటీ మంచిదేనా..



ఐదేండ్లు పదవీలో ఉండేందుకు ఏదో ఒక పార్టీ తరపున ప్రజలు ఎన్నుకుంటే తెలంగాణా అంశమో లేదా పార్టీలో తమ నాయకుడికి అనుకూలంగా లేదని అసంతృప్తితోనూ , తమకు మంత్రి పదవి రాలేదనో, మరో పార్టీలో చేరితే మంచి పదవులు వస్తాయనో కొందరు రాజీనామాలు చేసి మళ్ళీ వెంటనే పోటీ చేస్తున్నారు. దీనికి వారు పెట్టుకున్న పేరేమిటంటే ప్రజాభిప్రాయం అనో , సెంటిమెంటు అనో పేరు పెట్టుకుంటున్నారు. ప్రజలు కూడా ఎక్కువ శాతం వీరేదో తమకోసమో రాజీనామా చేసినట్టు భావించి మళ్ళీ ఎన్నుకుంటున్నారు. ఈ విధంగా గత 6 సంవత్సరములలో 65 స్థానాలకు ఎన్నికలు జరిగాయంటేనే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందో తెలుస్తుంది. దీనివల్ల ఏమైనా సాధించారా అంటే తమకు ప్రజలలో పలుకుబడి ఉందని నిరూపించుకోవడం తప్ప ఇంకేమి కనబడదు. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని ఇటీవల పరకాలలో బి.జె.పి పిలుపు నిచ్చింది. అంతేగాక టి.ఆర్.యస్. రాజీనామాలు చేసి తెలంగాణా సాధించలేదని ఎద్దేవా చేసింది. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అటు కె.సి.ఆర్, ఇటు జగన్ లు రాజీనామాలు చేయించి అనవసరమైన ఉపఎన్నికలు తెస్తున్నారని, ఇలా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయనీయకుండా కనీసం పదేళ్ళు నిషేధం ఉండాలని డిమాండు చేశారు. అసెంబ్లీ స్పీకరు నాదెండ్ల మనోహర్ ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ ఏదైనా కారణం వల్ల రాజీనామా చేసిన వారు కొంతకాలం వరకు పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చే విషయం పై చర్చలు జరుగుతున్నాయని అలాంటి చట్టం అవసరం ఉందని చెప్పారు. ప్రజల సొమ్మును, కాలాన్ని హరించే రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలో పాల్గొనే వారి పట్ల ఏదో ఒక చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. లేదంటే రాబోయే కాలంలో ఇదొక ఆటలా మారిపోయి , డబ్బులకు అమ్ముడయ్యే వారి సంఖ్య పెరిగి పోతుంది. 

జగన్ కు ఎందుకింత ధీమా ..


సాధారణంగా మనపై ఎవరయినా ఏదైనా ఆరోపణలు చేస్తుంటే మనం తల్లడిల్లిపోతాం. మన తప్పులేదని నిరూపించుకోవాలని తపించిపోతాం. తప్పుచేయకపోతే ఆ తప్పు వేరే వారు చెబుతూ ఉంటే ఎంత నరకమో వేరే చెప్పనక్కరలేదు. అయితే ఇక్కడ జగన్ అవినీతికి పాల్పడినాడని లోకం కోడై కూస్తున్నా.. ఆయన, ఆయన పార్టీ ఆ విషయాన్ని ఖండించకపోగా ఎదుటి వారిలో ఎవరు నీతిమంతులో చెప్పాలని అంటున్నారు. ఇదే విచిత్రం మాట తప్పని, మడమ తిప్పని వారు ఇలా అడ్డగోలుగా రాజ్యాంగం పై ప్రమాణం చేసిన దాన్ని మరిచి తరతరాలకు సరిపోయేటట్టు వెనుకవేసుకోవడం, నమ్ముకున్న వారిని జైలు పాలు చేయడం ఏ నాయకత్వం క్రిందికి వస్తుందో ఆలోచించాలి. పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు అవినీతి కేసులలో జైలు కెళ్ళినా ప్రక్క ధీమాగా ఉన్నట్టు నవ్వులు, దండాలు పెడుతున్నారు. లోకం ఏవగించుకుంటున్నా.. తుడుచుకుపోతున్నావారిని మనం ఏమనుకోవాలి. సంక్షేమాల ముసుగేసుకుని, కన్నీటి సెంటిమెంటుతో సెంటికొట్టుకున్నా అవినీతి కంపు వదలిపెట్టేటు లేదు మరి. ఈ ఎన్నికలలో ప్రజలు ఓడిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. అధికారం , ధనం తప్ప ప్రజల బాగోగులు పట్టని వారు నియంతలై పోతారు. ఈ రాష్ట్రాన్ని ఓటరు మహాశయుడు కాపాడుకుంటాడో లేదో వేచి చూడాలి. 

Wednesday 6 June 2012

సి.బి.ఐ కి తోడుగా రంగంలోకీ ఈడి.



జగన్ అక్రమాస్తుల వ్యవహారాన్ని విచారిస్తున్న సి.బి.ఐ కస్టడి ముగియగానే జగన్ ను ఈడి విచారించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నది. ఈ డి ప్రవేశంతోనే జగన్ ఆస్తులను ఆటాట్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే సానుభూతి ఓట్లపై ఆధారపడిన జగన్ మరింత లోతు కష్టాలలోకి దిగిపోనున్నారు. ఈడి పూర్తిగా విదేశాలనుండి అక్రమంగా తరలి వచ్చిన సొమ్ము, హవాలా మార్గంలో తెచ్చిన సొమ్ములను ఇప్పటికే గుర్తించినట్టు చెబుతున్నారు. జనంలో ఏదో సానుభూతి ఉందనుకుని అవినీతి కేసులలో ఇరుక్కున్న వారు ఆలోచించడం మన దేశంలోనే తొలిసారిగా విడ్డూరంగా ఉంది. జనం ఇంత వరకు అవినీతిని ఎప్పుడూ అందలం ఎక్కించరు. ఇలాంటి అవినీతి వల్లే కదా కరుణానిధి ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది. రాజశేఖర్ రెడ్డి తమకు ఏదో చేశాడని భ్రమించిన జనానికి మెల్ల మెల్లగా అర్థం అవుతోంది. అక్రమాలు చేయడం అదే హీరోయిజం అనుకోవడం చాలా తప్పు. అవినీతికి జనం వ్యతిరేకంగా జనం ఓట్లు వేసినప్పుడే రాబోయే కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చినా అవినీతి చేయడానికే జంకుతారు. లేదా అవినీతికే ఓట్లు వేస్తే తమకు అవినీతికి లైనెస్సు ఇచ్చినట్టు అంతా దోచేస్తారు కాబట్టి ఈడి ప్రవేశంతో నయినా ఓటర్లలో మార్పురావాలని సగటు మనిషి కోరుకుంటున్నాడు.

Tuesday 5 June 2012

తేజం తగ్గుతున్న తెలుగుదేశం


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే గాకుండా భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా 1983 లో ఒక ఉత్తుంగ తరంగమై, సామాజిక చైతన్యమై ఎగిసిపడి ఆవిర్భావంలోనే తాను తొమ్మిది నెలల పసికందుగా ఎదుర్కొన్న తొలి ఎన్నికలలోనే కాంగ్రెస్ పై అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించి తెలుగుదేశం తేజం రాను రాను తగ్గిపోతున్నది.

తెలుగు దేశం 1983 లోను 1985 లోనూ విజయం సాధించి 1989 లో ఓటమి చవిచూసింది. తిరిగి 1995 లోను, 1999 లోనూ విజయం సాధించింది. అలాగే 2004,2009 ఎన్నికలలో ఓటమి చెంది నీరసించి పోయింది. వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ పార్టీలో మునుపటి వాడి వేడి కనిపించడం లేదు.  పార్టీ అరంభించిన తొలి నాళ్ళలో అంతా కొత్తవారైనా ఎన్టీఆర్ సినీ గ్లామర్ మరియు ఆయన వాగ్దాటి పార్టీ వైపు జనాన్ని తెలుగుదేశం పిలుస్తోంది రా రమ్మని స్వాగితించాయి. బడుగు బలహీన వర్గాలకు అండంగా విద్యావంతులకు, యువకులకు ఎక్కువ సీట్లు కేటాయించి విజయ దుందిబి మ్రోగించింది. సంవత్సరం తిరగకుండానే నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తరువాత పదవీ నుండి తప్పిస్తే నేలకు కొట్టిన బంతిలా నెల తిరుగకుండానే తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తరువాత  అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు పోయి తిరిగి విజయం సాధించారు.దీంతో ఆయన వైఖరిలో నియంతగా వచ్చిన మార్పుల కారణంగా ఒకేసారి కేబినెట్ లో 30 మంది మంత్రులను రాజీనామా చేయించడం తది తర నిర్ణయాలతో 1989 లో ఓటమి చవిచూశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలుగుదేశం 1995 లో విజయం సాధించింది. అప్పుడు పార్టీలో వివిధ వర్గాలు ఉన్నా రామారావు తిరిగి కేడర్ లో నమ్మకం నిలిపి కాంగ్రెస్ పై అఖండ విజయం సాధించారు. అంతేగాక నేషనల్ ప్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై వి.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం మనే చెప్పాలి. ప్రతిపక్షనేతలను కలిపి రామారావు దేశ రాజకీయాలలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
 లక్ష్మీ పార్వతి ప్రవేశంతో పార్టీలో అసమ్మతి మొదలై తుదకు రామారావునే ఆ పార్టీ నుండి తొలగించి చంద్రబాబు నాయుడు 1995 లో ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మృతి చెందడంతో బాబు తెలుగుదేశం పూర్తి స్థాయి తెలుగు దేశంలా మారింది. చంద్రబాబు  తన ఇమేజ్ ను పెంచుకొని శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి లాంటి విన్నూత కార్యక్రమాలు చేపట్టి అందరి మన్నలను పొందారు. ఆకస్మిక తనిఖీలు చేయడం, మహిళా డ్వాక్రా సంఘాల ఏర్పాటు దానికి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం, నీరు-మీరు లాంటి సామాజిక అవగాహనా కార్యక్రమాలు చేపట్టి 7 సంవత్సరముల కరువు సమయంలోనూ ప్రజలకు ప్రభుత్వం ఉందనే హామిని ఇవ్వగలిగారు. ఈ సమయంలోనే ప్రభుత్వంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి ప్రభుత్వ నష్టాలను చాలా భాగం తగ్గించి వేశారు. అంతేగాకుండా సైబరాబాద్ లో హైటెక సిటీ ఏర్పాటు వల్ల హైదరాబాదు కు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే గాకుండా నిరుద్యో సమస్య చాలా భాగం తీరిందనే చెప్పవచ్చు.  కేంద్రంలో రాజకీయ ప్రభావం చూపి రాష్ట్రపతి, స్పీకరు అభ్యర్థుల ఎంపికలోనూ, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపికలోనూ కీలక పాత్ర  పోషించడం జరిగింది. అయితే రెండవసారి వాజ్ పాయ్ ప్రభుత్వంతో ఉన్నసంబంధంతో బి.జె.పి పొత్తుతో ఎన్నికలు గెలవడంతో ఆయన తీరులో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. అంతవరకు అందరినీ కలుపుకొని పోయిన బాబు ఆ తరువాత అందరినీ దూరం చేసుకుంటూ పోయారు. దీంతో పాటు కరువు వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా తయారయింది. ఇదే సమయంలో పాదయాత్ర చేసి, రైతులకు ఉచిత కరెంటు హామీని ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఉద్యోగులు, రైతులు దూరంకావడంతో ఆ ఎన్నికలలో ఓటమిపాలయి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. ఇక 2009 ఎన్నికలలో అయితే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నంత హడావుడి జరిగింది. మహా కూటమి ఏర్పాటు చేయడంతో పాటు టి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకొని బాగానే ప్రచారం చేసుకున్నా చిరంజీవి ప్రజారాజ్యం
పార్టీ పెట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ఆ ఎన్నికలలో తిరిగి  తెలుగుదేశం ఓటమి చవిచూడవలసి వచ్చింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ బోటాబోటీ  మెజారిటీతో గెలుపొందడం జరిగింది.ఆ తరువాత ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పనులను తూర్పారబట్టినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆపరేషన్ ఆకర్ష, ప్రజారాజ్యం ఏర్పాటు వల్ల, తెలంగాణా సమస్య వల్ల చాలామంది నాయకులు పార్టీని వీడినా కేడర్ మాత్రం పార్టీనే అంటి పెట్టుకుని ఉంది. అయితే ఆ పార్టీకి జిల్లా స్థాయిలో నడిపించే నాయకులే కరువయ్యారు. నాయకులు తమ స్వంత వ్యాపారాలు చూసుకుంటూ పార్టీ పనిని పార్ట్ టైం పనిగా చేసుకన్నారనే చెప్పాలి. ఎన్నికలప్పుడు మాత్రమే హడావుడి చేసే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఓటమికి బాబును మాత్రమే భాద్యత చేసి పార్టీలో ఉంటూనే తాము వ్యతిరేకంగా పనిచేస్తుండడం విశేషం.  రాజశేఖర్ రెడ్డి మృతి తరువాత కూడా ఆ పార్టీ తెలంగాణాలోనూ ఇటు రాయలసీమ, కోస్తాలోనూ ఎదురీదుతున్నది. తెలంగాణాలో టి.ఆర్.యస్. తో ఇబ్బంది కర పరిస్థితులు వస్తుంటే మిగిలిన ప్రాంతాలలో జగన్ ను ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారుతోంది. దేశంలోనే జగన్ అక్రమాస్తుల కేసకు పెద్ద అవినీతి అని తెలిసినా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా పార్టీ కేడర్ లో మాత్రం నాయకత్వంపై నమ్మకం సడలినట్టు కనపడుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వరుస ఓటములు, జిల్లా స్థాయిలో నాయకుల మధ్య కుమ్ములాటలు ఒక ప్రక్క మరో ప్రక్క పార్టీకి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నట్టు సమాచారం. అందువల్ల చంద్రబాబు ఒక్కడి పైననే భారం పడుతోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం బలహీనంగా ఉందని కూడా బలంగా చెప్పవచ్చు. దీంతో రాబోయే కాలంలో ఆ పార్టీ తిరిగి పుంజుకోవాలంటే ఎదుటి వారి బలహీనతలపై ఆశలు పెట్టుకొని ఉంది. ఈ ఎ న్నికలు తెలుగుదేశం తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం.

Monday 4 June 2012

పొన్నాలకు సి.బి.ఐ పిలుపు



జగన్ ఆక్రమాస్తుల కేసును విచారిస్తున్న సి.బి.ఐ. తాజాగా రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యను విచారణ నిమిత్తం రావలసినదిగా కోరింది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో వివాదాస్పదంగా జారీ అయిన 26 జి.ఓ లలో పొన్నాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసేవారు. ఇండియా సిమెంట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటి కేటాయింపులకు మంత్రి జి.ఓ జారీ చేశారు. అదే కంపెనీ తిరిగి జగన్ కంపెనీలో రూ. 100 కోట్ల పైబడి పెట్టుబడులు భారీగానే పెట్టింది. ఇది వరకే ఆశాఖ కు కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యాదాస్ ను సి.బి.ఐ విచారించడం జరిగింది. అప్పటి మంత్రి మండలిలో పనిచేసిన మోపిదేవి వెంకటరమణ అరెస్టు అయి సి.బి.ఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇంకా సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, లాంటి మంత్రులు పొన్నాలకు పిలుపు రావడంతో తమకు పిలుపు ఎప్పుడు వస్తుందోనని కలత చెందుతున్నారు. వీరందరినీ సి.బి.ఐ విచారించడానికి ఇది వరకే నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. 

సి.బి.ఐ కి కొరకరాని కొయ్యగా జగన్



తనను విచారిస్తున్న సి.బి.ఐ కి జగన్ చుక్కలు చూపుతున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి  ప్రవర్తించినట్టుగానే అన్నిటికీ తెలియదు అని సమాధానం చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామానికి జగన్ ఉల్లాసంగా ఉంటుంటే ఏమి చేయాలో తెలియని సి.బి.ఐ విస్తూ పోతోంది. దీంతో సత్యసోధన పరీక్షల నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందేమో వేచి చూడాలి. తాను చేసిందంతా చేసి చివరికి అమాయకుడిలా నటిస్తున్న జగన్ సానుభూతి పవనాలలతో ఉప ఎన్నికలు గెలవగలమని అనుకుంటున్నారు. తల్లి, చెల్లి వీధులు తిరుగుతు కన్నీళ్ళతో ప్రచారం చేస్తుండటం ఆయనకు కలసి వస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే సభలు వచ్చిన వారంతా తనకే ఒటు వేస్తారనుకున్న వారంతా గతంలో మట్టి కరిచారు. ప్రజలు విక్షచణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేస్తే మాత్రం ఉప ఎన్నికలలో జగన్ పార్టీ కష్టాలు ఎదుర్కొంటుంది. ఇక సి,.బి.ఐ కి జగన్ కేసు ఒక సవాలుగా పరిణమిస్తోంది. చూద్దాం ఏమి జరుగుబోతుందో.. 
 

Saturday 2 June 2012

రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు


రాష్ట్ర్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీద ఉంది. ఎదుటి వారిపై బురద జెల్లడానికి ఉన్న  అన్నింటిని అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికల ప్రచారం మొదలవడంతోనే వై.యస్.ఆర్ పార్టీ అధ్యక్షుడిని అవినీతి, అక్రమాస్తుల కేసుల విచారణ నిమిత్తం సి.బి.ఐ అరెస్టు చేయడంతో మొత్తం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి గందరగోళంగా తయారయిందని చెప్పవచ్చు. అంతకు మునుపు జగన్ ను రాజకీయంగా అణగద్రొక్కుతున్నార్న దానికి అనుకూలంగా ఉన్న ప్రజానీకం జగన్ అరెస్టుతో ఓటర్ల మనోగతం మారిపోయినట్టు కనబడుతోంది. ముఖ్యంగా హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత సి.బి.ఐ అరెస్టు చేయడం సక్రమమేనని హైకోర్టు తీర్పు నివ్వడంతోను మరియు గాలి జనార్థన్ రెడ్డి కేసులో న్యాయమూర్తి బెయిల్ కోసం లంచం తీసుకున్న సంఘటనను సి.బి.ఐ బట్టబయలు చేయడంతోను జనం అభిప్రాయంలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక జగన్ స్థానంలో ప్రచారానికి దిగిన విజయమ్మ, షర్మిల లు ప్రచారంలో రాజశేఖర్ రెడ్డి చావును కూడా రాజకీయానికి వాడుకోవడంతో సానుభూతి స్థానంలో మరింత వ్యతిరేకత పొడసూపినదని సమాచారం. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అయోమయంలో పడిపోయింది. వలసలలు వస్తారనుకున్న యం.ఎల్.ఏ లు కూడా పునరాలోచలో పడ్డారు. తెలుగుదేశం నూజీవీడు యం.ఎల్.ఏ రామ కోటయ్య తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నానీ తో పాటు మరో 5-10 మంది వస్తారనుకున్నా వారేమీ వలసలు వచ్చేట్టు లేదు. ఇంతకు మునుపు కన్నా ఆ పార్టీ నాయకుడు జగన్ పై అవినీతి ఆరోపణలు సునామీలా చుట్టు ముడుతున్నాయి. ఈ లోపుగా కాంగ్రెస్ చాపక్రింద నీరు లా కేడర్ ను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ, 1 లోకసభ స్థానాలలో ఇంతకు మునుపు అన్నీ తామే గెలుస్తామని చెపుతూ వచ్చిన వై.యస్.ఆర్ పార్టీ ఇప్పుడు అంత నమ్మకంతో లేదు. ప్రస్తుతం ఆ పార్టీ పూర్తిగా సానుభూతి పవనాలపైననే ఆశలు పెట్టుకోనున్నది. తెలంగాణాలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక అసెంబ్లీ స్థానం పరకాలలో అయితే కొండాసురేఖ గెలుపు పై ఎవరూ నమ్మకంతో లేరు. అక్కడ టి.యస్.ఆర్., బి.జె.పిలు పోటా పోటీగా గెలుపు బాటలో ఉన్నాయి. ఇక చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతిలో అయితే అప్పుడే కాంగ్రెస్ ఆభ్య్రర్థి తన ఓటమి ఖాయ మన్నట్టు, తనకు పార్ఠీ వారే వెన్నుపోటు పొడుస్తున్నట్టు విలేకరులతో వాపోయారు. అక్కడ గతంలో కరుణాకర రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గతంలో చిరంజీవి పై ఓడిపోయారు. ఇప్పుడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పై పోటీలో ఉన్నా ఆయనపై ఆరోపణలు ఆయనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. అక్కడ టి.డి.పి అభ్యర్థి చదలవాడకు గెలుపు అవకాశం రోజు రోజుకు పెరుగుతోంది. అదేవిధంగా మిగిలిన నియోజక వర్గాలలో కూడా సమీకరణలు మారుతున్నాయి. ఈ లెక్కలన 18 స్థానాలకు గాను వై.యస్.ఆర్ పార్టీ 7-9 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ చెరి సగం పంచుకుంటాయి. ఈ ఉప ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిచినా వై.యస్.ఆర్ పార్టీ ప్రస్తుతం తన ప్రక్కన ఉన్న కొంత మంది. యం.ఎల్.ఏల ను కోల్పోకతప్పదు.  ఒక వేళ అన్ని సీట్లు గెలువగలిగితే కాంగ్రెస్ నుండి వలసలు మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది. 

సి.బి.ఐ కస్టడీకి జగన్


తనను అరెస్టు చేయడం, మరియు తనపై అక్రమ కేసులు పెట్టడాన్ని కొట్టివేయాలని జగన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు శనివారం కొట్టివేసింది. అంతే గాక సి.బి.ఐ  చర్యను సమర్థిస్తూ అరెస్టు సక్రమమేనని, మరిన్ని విషయాలు విచారించడానికి గాను జగన్ ను సి.బి.ఐ కస్టడీకి అప్పజెప్పింది. జగన్ ఈ కేసు నిమిత్తం ఢిల్లీ నుండి పెద్ద పేరున్న లాయర్లను పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. 37 అంశాలకు సంబంధించి, విదేశీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలనే సి.బి.ఐ వినతిని మనిస్తూ 5 రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పును వెలువరించింది. ఎన్నికలలో తాను ప్రచారం చేసుకోవాలని జగన్ పెట్టుకున్న పిటీషన్లతో పాటు అన్ని పిటీషన్లను కొట్టివేస్తూ తీర్పున వెలువరించింది. అయితే చాలామంది కె.ఏ. పాల్ కు ఎన్నికల దృష్ట్యా బెయిల్ దొరికినట్టు దొరుకుతుందేమోనని ఆశించారు. అయితే ఈ కేసును ఆ కేసుతో పోల్చి చూడలేమని, నేరం తీవ్రంగా ఉన్న దృష్ట్యా , నిందితుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా  జగన్ ను బెయిల్ ను నిరాకరిస్తూ సి.బి.ఐ కస్టడీకి అప్పజెప్పింది. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో గుబులు అలుముకున్నట్టే. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీకి హైకోర్టు తీర్పు చెంప పెట్టులా భావిస్తున్నారు.  

Friday 1 June 2012

ఉప ఎన్నికల లోపుగా మచ్చపడ్డ మంత్రుల అరెస్టు ?


వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర్ర ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో విడుదలయిన 26 జి.వోలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులను దశలవారీగా సి.బి.ఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వాక్ పిక్ కుంభకోణంలోమోపిదేవి వెంకటరమణ అరెస్టయిన విషయం విదితమే. అదేవిధంగా అప్పుడు మంత్రులుగా పనిచేసిన గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు లతో సహా మరో ఇద్దరు మంత్రులను అరెస్టు చేసే అవకాశం ఉందని మీడియా కోడై కూస్తోంది. వీరు అరెస్టును తప్పించుకునేందుకు గాను ముఖ్య మంత్రి స్థాయిలో ప్ర.యత్నం  చేసి వీలుకాక కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికలలో జగన్ అరెస్టు వల్ల సానుభూతి రాకుండా ఉండడం కోసం వారిని ఉప ఎన్నికలలలోపుగా అరెస్టు చేసేందుకు తద్వారా జగన్ పై సానుభూతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుండడం విశేషం. ఏది ఏమైనా రాజశేఖర్ రెడ్డి చేయించిన అవినీతి మరింత మందిని బలితీసుకునే అవకాశం ఉందని చెప్పకతప్పదు.

న్యాయమూర్తి కే సోకిన అవినీతి గాలి



తలుచుకుంటేనే కంపరం పుట్టేవిధంగా సి.బి.ఐ న్యాయమూర్తిగా ఉన్న పట్టాభిరామ్ డబ్బులు తీసుకుని గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం అనేది అవినీతి విషపు నాగు వేళ్ళూనుకున్న విషయాన్ని నిర్ధారిస్తోంది. గనులు తవ్వుకుని కోట్లు గడించిన అహంకారంతో న్యాయవ్యవస్థనే కబళించపూనడం నిజంగా దురదృష్టకరం. మెలుకువగా ఉన్న సి.బి.ఐ ఎంతో చాకచక్యంగా ఈ కేసును పరిశోధన చేసి హైకోర్టు ద్వారా పూర్తి విచారణకు అనుమతి పొందడం మెచ్చదగిన విషయం. ఈ విషయంలో న్యాయ మంత్రి ఏరాసు ప్రతాప్ పేరు వినపడుతుండడంతో అవినీతికి , రాజకీయానికి ఉన్న లంకె చెప్పకనే చెబుతున్నది. వ్యవస్థలను నాశనం చేసే తాము కోట్లు గడించేందుకు ఎంతకైనా దిగజారే ఈ నాయకులను ఉరితీసినా పాపం లేదు. వీరి ఆస్తులను ఉన్న ఫలంగా జప్తుచేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పని చేయడానికి భయపడాల్సిన అవసరం ఉంది. ఇవ్వన్ని చూస్తుంటే పాపం గాలి జనార్థన్ తమ్ముడు మన జగన్ బెయిల్ పై పెట్టుకున్న ఆశలు అడుగంటి పోయినట్టు కనిపిస్తోంది. 

కాంగ్రెస్ లో వలసల కార్చిచ్చు



ఏ మూహుర్తాన రాజశేఖర్ రెడ్డి మృతి చెందారో ఏమో కాని అప్పటినుండి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు జగన్ వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ముఖ్యంగా ముఖ్య మంత్రులకు రోశయ్య అయితేనేం , కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేం జగన్ దెబ్బకు విలవిలలాడి పోయారనే చెప్పాలి. ఇప్పుడయితే కాంగ్రెస్ విమర్శల వేడి పెంచింది కాని మొదట్లో విమర్శించలేరు అలా అని మౌనంగా ఉండలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే రాను రాను జగన్ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యు స్వంత కుంపటి పెట్టుకున్నాక సి.బి.ఐ కేసుల వలలో ఇరుక్కుపోయారు. ఇలా జగన్ తన ఓదార్పు యాత్ర నుండి ఇప్పటి సి.బి.ఐ అరెస్టు వరకు ప్రతి క్షణంలోనూ కాంగ్రెస్ అనే మహా పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు. రోశయ్య సి.యం అయిన కొత్తలో కొండా సురేఖ మంత్రిగా ఆయన మంత్రి వర్గంలో మంత్రిగా ఉండేవారు . ఆమె ద్వారా సి.యం. రోశయ్యను విమర్శలు చేయుస్తూ చివరికి రాజీనామా చేయుంచారు. ఆ తరువాత ఓదార్పు యాత్రలో పాల్గొననీయకుండా యం.యల్.ఏ లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసినప్పుడు తన వర్గం వారితో బల ప్రదర్శన చేయించి కాంగ్రెస్ లో కలవరానికి కారణమయ్యారు. చివరికి తనకు తానుగా పార్టీ ఏర్పాటు చేసుకున్నాక కూడా తన వర్గం వారిని అక్కడే ఉంచి సి.బి.ఐ  చార్జీషీటులో వై.యస్.ఆర్ పేరు చేర్చినందుకు గాను 17 మంది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించి ఉప ఎన్నికలకు కారణమయ్యారు. ఇప్పుడు సి.బి.ఐ అరెస్టు సందర్భంలోనూ నానీ తదితరులు కాంగ్రెస్ నుండి వచ్చేలా ప్రణాళిక రూపొందించి కాంగ్రెస్ ను ఇబ్బందులలోకి నెట్టారు.  తన పై సెంటిమెంటు రావడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్న జగన్ జైలు నుంచే కాంగ్రెస్ నుండి మరిన్ని వలసలు రావడాన్ని ప్రోత్సహిస్తున్నట్టు భోగట్టా.
వందల సంవత్సరాల పార్టీకి ముచ్చేమటలు పోయిస్తున్న జగన్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నది.