Friday 10 May 2013

వచ్చే ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎవరిది ??



  సాధారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఆ పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న వారు ఎన్నికలలో నాయకత్వం వహిస్తుంటారు. మన రాష్ట్రం  విషయానికి వస్తే వచ్చే 2014 ఎన్నికలలో నాయకత్వం కోసం పోటీ మొదలయింది. ఎందుకంటే ఎన్నికలకు నాయకత్వం వహించే వారే ఒక వేళ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుంటుంది . రాష్ట్ర కాంగ్రెస్ లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జనాకర్షణ వున్న నాయకుడు లేడు. అయితే అధిష్టానం అండదండలతో ముఖ్యమంత్రి పీఠం పై వున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపిస్తాడని ఎవరూ అనుకోవడం లేదు. అందుకని పనిలో పనిగా వచ్చే ఎన్నికలలో అయినా నాయకత్వం కోసం ఒక ప్రక్క బొత్స సత్యనారాయణ మరో ప్రక్క చిరంజీవి పావులు కదుపడం మొదలు పెట్టారు. తమ వారితో ఈవిషయమై చిరంజీవి మాట్లాడిస్తున్నట్టు బోగట్టా. మంత్రి హోదాలో వుండి కూడా సి. రామచంద్రయ్య తరచూ చిరంజీవి వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఆయన నాయకత్వంలో ఎన్నికలు ఎదుర్కుంటే పార్టీ తప్పక గెలుస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే జనం నాయకులు ఎవరు మారినా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పలేం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు పోటీ నిలుస్తున్న వై.యస్.ఆర్ పార్టీ ఓట్లను ఎంతవరకు చీల్చగలిగితే అంత కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది.  వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ గెలుస్తుందో లేదో చెప్పడం కన్నా ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను మాత్రం పెంచుతున్నదని నిరూపితమవుతోంది.