Tuesday 10 April 2012

ఉపద్రవం కానున్న ఉప ఎన్నికలు



రాష్ట్రంలో 18 స్థానాలలో త్వరలో జరగనున్న మినీ ఎన్నికలు అవే ఉప ఎన్నికల గురించి అప్పుడే పాలక, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ జ్వరం పట్టుకున్నాయి. త్రికోణపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికలలో ఇదివరకు అన్ని సీట్లూ కాంగ్రెస్ పార్టీవే. అయితే జగన్ పార్టీ నుండి వేరు పడి స్వంత కుంపటి పెట్టుకున్నాక అక్కడి యం.ఎల్.ఏ లంతా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో విశ్వాసంగా ఓటు వేయకుండా తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి మద్ధతు తెలిపినందున అనర్హతకు గురయిన విషయం విదితమే.  ఎలాగయునా అన్ని సీట్లూ తామే గెలవాలని వైయస్ఆర్ పార్టీ కోరుకుంటోంది. ఈ ఎన్నికలలో ఓటమి పాలయితే రాజకీయంగా ఆ పార్టీకి మరియు జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. అలా కాకుండా కనీసం ముప్పాతిక సీట్లలో గెలిచినా ఆయనకు ఢోకాలేదు. వచ్చే ఎన్నికలపై ఆయన ఆశలు పెట్టుకోవచ్చు. అనుచరులను కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా ఆయన తనపైన,  వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపై సి.బి.ఐ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో జరుగుతున్నవి. కాబట్టి ఆయన భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చివేస్తాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం కూడా చావో రేవో తేల్చుకోబోతున్నది. ఈ ఎన్నికలలో సగం గెలిచినా ఆ పార్టీ తన ఉనికిని చాటినట్టే భావించాలి. అయితే గతంలో ఈ స్థానాలన్నింటిలో ఆ పార్టీ ఓడినది కాబట్టి అంత ఫలితాలు ఆశించలేము. ఎందుకంటే ప్రతిపక్షంగా కూడా తెలుగుదేశం ప్రజాభిమానాన్ని పొందలేకపోతున్నది. కాంగ్రెస్ ముఠాకుమ్ములాటలలో బిజీగా ఉన్న సమయం, అటు జగన్ శిబిరంలో
సి.బి.ఐ కేసుల భయం ఉన్న సమయంలో తెలుగుదేశం కు ఈ ఎన్నికలు సహజంగా లాభించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు చీలిపోతున్నాయి. అయితే వాస్తవంగా చూస్తే ఆ పార్టీలో గెలుపు పై అంత ధీమా ఉన్నట్టు కనబడడం లేదు. తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంటూ ఆర్థిక వనరులను
కూడ గట్టుకోవడం ఆ పార్టీకి ఓ సమస్యగా మారిందని చెబుతున్నారు.అయితే అప్పుడే తిరుపతిలో శంఖారావం సభతో ప్రచారం ప్రారంభించడం చూస్తే ఆ పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు ఎంత అవసరమో తెలుస్తోంది.

ఇక పోతే కాంగ్రెస్ విషయానికి వస్తే ఇంతకు మునుపు జరిగిన ఉప ఎన్నికలలో ఒక్క సీటు గెలువలేకపోయి పార్టీలో అసమ్మతికి బీజం పడింది. రాబోయే ఉప ఎన్నికలలో కూడా  ఆ పార్టీ
ఎలాగయినా సగం సీట్లయినా గెలువాలని పట్టుదలతో ఉంది. అలా గెలవలేకుంటే ఆ పార్టీలో కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం సునామీలా చుట్టుముట్టే అవకాశం ఉంది. చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతిలో
కాంగ్రెస్ గెలువడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి పై అక్కడ ఉన్న అసంతృప్తి అంతా ఇంతా కాదు. ఆ ప్రభావం ఓటమికి దారి తీయవచ్చు. అదేగాక బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి పొసగక పోవడం మరో సమస్యగా తయారయింది. పైకి అందరూ ఒకటిగా కలసినట్టే కనిపిస్తోన్నా ఎన్నికల నాటికి కలసి ఉంటారా అంటే చెప్పలేని స్థితి.
  
ఈ మూడు పార్టీలు తెలంగాణాలో టి.ఆర్.యస్ ను ఎదుర్కొని ఓట్లు పొందడం అసాధ్యం. ఒక వేళ తెలంగాణాలో తెలుగుదేశం కాని , కాంగ్రెస్ కాని విజయం సాధిస్తే టి.ఆర్.యస్ కు ఎదురు దెబ్బగా భావించాలి. అసలే మహబూబ్ నగర్ లో బి.జె.పి చేతిలో ఓడిన టి.ఆర్.యస్ ఈ సారి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలదు. ఎటు చూసినా ఈ రాబోయే ఎన్నికలు రాష్ట్రంలో పెద్ద ఉపద్రవాన్ని తీసుకువస్తాయని చెప్పవచ్చు

Wednesday 4 April 2012

తెలుగుదేశం వైపు... జయప్రద చూపు...




రామారావుపై ఉన్న అభిమానంతో రాజకీయాలలోకి వచ్చినట్టు చెప్పుకునే జయప్రద , ఆయనకు చంద్రబాబు ద్వారా వచ్చిన సంక్షోభంలో అండగా నిలువలేకపోయారు. చంద్రబాబు వెంటే ఉండి రాజ్యసభకు ఎం.పిగా మారిపోయారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అమర్ సింగ్ పరిచయమయిన తరువాత జయప్రద రూటు మారిపోయింది. మెల్లగా తన రాజకీయ జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు మార్చుకున్నారు. 


సమాజ్ వాదీ పార్టీ నుండి  అమర్ సింగ్ ను తొలగించిన తరువాత ఆమె కూడా సమాజ్ వాదీ పార్టీని వదలి ఆయనతో పాటే నడిచారు. వీరు ఎప్పుడూ జంటగా ఉండడం మరో ముచ్చట. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ ప్రభుత్వం ఏర్పడడం ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. అమర్ సింగ్ సి.బి.ఐ కేసులలో అరెస్టు కావడంతో పాటు రాజకీయంగా ప్రాభవం కోల్పోయిన సమయంలో ఆమె తిరిగి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో తిరిగి రావాలనుకుంటున్నట్టు ప్రకటించడం చూస్తే ఆమె పరిస్థితి అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆమెకు ఉన్న రెండు మార్గాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. ముందుగా వైయస్ఆర్ పార్టీలో చేరుదామంటే అక్కడ ఉండలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్న జయసుధ గుర్తు వచ్చినట్టు ఉంది. పోనీ కాంగ్రెస్ కు వెళ్ళాలంటే అక్కడ సినిమారంగంలో తనకు పోటీగా ధీటుగా ఉన్న జయసుధ ఉంది. జయసుధ ఉండగా తనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందో లేదో తెలియదు. అదీగాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారయింది. ఇక తప్పని సరి పరిస్థితులలో ఆమె తన స్వంతగూడు తెలుగుదేశం పార్టీకి చేరాలనుకుంటున్నట్టు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు ద్వారా తగిన మాట తీసుకున్న తర్వాతే ఆయన సూచన మేరకే ఆమె బాలకృష్ణను, చంద్రబాబును ఆకాశానికెత్తేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ముందుగా సమాచారం లీకు జేసి క్యాడర్ ప్రతిస్పందన ఆధారంగా నిర్ణయం తీసుకోవడం కోసమే చంద్రబాబు ఈ విధంగా చేయించినట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో పార్టీని వదలాలనుకున్న తలసాని కూడా ఇది సమయం కాదని విరమించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  మరి జయప్రద తిరిగి రావడం తెలుగుదేశం కు జయప్రదం అవుతుందో లేదో
రాబోయే రోజుల్లో తెలుస్తుంది.