Wednesday 4 April 2012

తెలుగుదేశం వైపు... జయప్రద చూపు...




రామారావుపై ఉన్న అభిమానంతో రాజకీయాలలోకి వచ్చినట్టు చెప్పుకునే జయప్రద , ఆయనకు చంద్రబాబు ద్వారా వచ్చిన సంక్షోభంలో అండగా నిలువలేకపోయారు. చంద్రబాబు వెంటే ఉండి రాజ్యసభకు ఎం.పిగా మారిపోయారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అమర్ సింగ్ పరిచయమయిన తరువాత జయప్రద రూటు మారిపోయింది. మెల్లగా తన రాజకీయ జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు మార్చుకున్నారు. 


సమాజ్ వాదీ పార్టీ నుండి  అమర్ సింగ్ ను తొలగించిన తరువాత ఆమె కూడా సమాజ్ వాదీ పార్టీని వదలి ఆయనతో పాటే నడిచారు. వీరు ఎప్పుడూ జంటగా ఉండడం మరో ముచ్చట. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ ప్రభుత్వం ఏర్పడడం ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. అమర్ సింగ్ సి.బి.ఐ కేసులలో అరెస్టు కావడంతో పాటు రాజకీయంగా ప్రాభవం కోల్పోయిన సమయంలో ఆమె తిరిగి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో తిరిగి రావాలనుకుంటున్నట్టు ప్రకటించడం చూస్తే ఆమె పరిస్థితి అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆమెకు ఉన్న రెండు మార్గాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. ముందుగా వైయస్ఆర్ పార్టీలో చేరుదామంటే అక్కడ ఉండలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్న జయసుధ గుర్తు వచ్చినట్టు ఉంది. పోనీ కాంగ్రెస్ కు వెళ్ళాలంటే అక్కడ సినిమారంగంలో తనకు పోటీగా ధీటుగా ఉన్న జయసుధ ఉంది. జయసుధ ఉండగా తనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందో లేదో తెలియదు. అదీగాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారయింది. ఇక తప్పని సరి పరిస్థితులలో ఆమె తన స్వంతగూడు తెలుగుదేశం పార్టీకి చేరాలనుకుంటున్నట్టు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు ద్వారా తగిన మాట తీసుకున్న తర్వాతే ఆయన సూచన మేరకే ఆమె బాలకృష్ణను, చంద్రబాబును ఆకాశానికెత్తేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ముందుగా సమాచారం లీకు జేసి క్యాడర్ ప్రతిస్పందన ఆధారంగా నిర్ణయం తీసుకోవడం కోసమే చంద్రబాబు ఈ విధంగా చేయించినట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో పార్టీని వదలాలనుకున్న తలసాని కూడా ఇది సమయం కాదని విరమించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  మరి జయప్రద తిరిగి రావడం తెలుగుదేశం కు జయప్రదం అవుతుందో లేదో
రాబోయే రోజుల్లో తెలుస్తుంది.  

No comments:

Post a Comment