Monday 26 March 2012

వ్యూహాత్మకంగా తిరిగి రాజుకుంటున్న తెలంగాణా వేడి


సకల జనుల సమ్మె తరువాత ఇంత వరకు ప్రశాంతంగా తెలంగాణాలో వ్యూహాత్మకంగా మళ్ళీ ఉద్యమ వేడి రాజుకుంటున్నది.

కాంగ్రెస్ యం.పి.లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్లమెంటు రాజ్యసభ లో కేశవరావు ద్వారా తమ వాణిని వినిపించారు కూడా. అధిష్టాన పై ఒత్తిడి తీసుకువచ్చి ఎలాగయినా తెలంగాణా సాధించే వరకు విశ్రమించరాదని భావిస్తున్నారు. అలా వీలు కాకపోతే టి.ఆర్.యస్ లో చేరడమో లేదా వేరే పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

శాసన సభలో టి.ఆర్.యస్ శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారో లేదో తెలంగాణా పై వెంటనే తమ వాణి బలంగా వినిపించారు. బి.జె.పి , తెలంగాణా తెలుగుదేశం శాసన సభ్యులు కూడా పోడియం ముట్టడించి సభ వాయిదా పడేట్లు చేశారు. దీనిని ముందే తెలంగాణా వరంగల్ కు చెందిన భోజ్యానాయక్, రాజమౌళి అనే విధ్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రభావం సమావేశాలపై బలంగా పడింది. వీరి అంతిమ యాత్రలో విధ్వంసం కూడా చోటుచేసుకుంది.  

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తన రాష్ట్ర విభాగానికి ఎలా నడుచుకోవాలో చెప్పేందుకు గాను పార్టీ యం.పిలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఉప ఎన్నికలలో టి.ఆర్.యస్ అభ్యర్టులు గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు తిరిగి ఉద్యమ ఉదృతికి కీలాశీల మవుతున్నారు. అయితే జె.ఎ.సి కోదండరామి రెడ్డికి  టి. ఆర్.యస్ కు సంబంధాలు మహబూబ్ నగర్ ఓటమి విషయమై చెడినట్టు వార్తలు వచ్చినా ఉద్యమానికి అదేమి పెద్దగా అడ్డంకిగా మారడంలేదు. ఉద్యమ రూపం హింసాత్మకంగా మారకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

డి.యల్. రాజీనామా ఎందుకు చేశారు...



దేనికయిన సమయం సందర్బం అవసరం. లేకుంటే అది ఆభాసుపాలవుతుంది. లేదా తిరగి తమకే తగులుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కడప జిల్లాకు చెందిన మంత్రి డి.యల్ . రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడం ఆ  కోవలోకే వస్తుందని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి మండలి విస్తరణలో రవీంద్రా రెడ్డికి చెందిన శాఖలో కోత కోయడంతో అప్పటి నుండి ఆయన కుత కుత లాడి పోతున్నారు. అంతకు మునుపు కడప లోకసభకు జరిగిన ఎన్నికలలో ఓడిపోయినప్పుడు రాజీనామా చేయని రవీంద్రా రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి పై అసంతృప్తికి ఆజ్యం పోయాలనుకున్నారు. అయితే ఆ యన తన రాజీనామాను ముఖ్య మంత్రికి పంపకుండా సోనియాకు పంపడంతో అది పేలని టపాసయింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. అయితే కిరణ్ వ్యవహార శైలిపై మాత్రం చాలామంది కినుక వహిస్తున్నారు. ఎవరూ నాయకత్వం వహించే పరిస్థితి లేని ఈ సమయంలో కిరణ్ కు అన్ని కలసి వస్తున్నాయి. చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది. 

రామ చంద్రయ్య నోట చిరు మాట


తిరుపతి శాసన సభ్యుడైన చిరంజీవికి రాజ్యసభ సీటు కేటాయించిన తరువాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. పి.ఆర్.పి పూర్తిగా విలీనం అయిపోయిన తరువాత ప్రభుత్వం లో తమకు అంతగా పట్టులేకపోవడంతో అంటే అందరూ కాంగ్రెస్ శాసన సభ్యులుగా మారడంతో వారు ఎటూ ప్రభుత్వానికే మద్ధతు ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ముప్పుకూడా ఏమీ లేదు. అయితే పి.ఆర్.పి విలీనం వల్ల చాలా మంది శాసన సభ్యులకు అటు కాంగ్రెస్ లోనూ ఇటు పి.ఆర్.పిలోనూ ఆశాభంగం కలిగింది. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా వ్యతిరేక భావన వచ్చింది. ఇప్పుడు చిరంజీవికి మంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు గాను మరియు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావడం ఉద్దేశంతోనే చిరంజీవి రామచంద్రయ్య ద్వారా ఇలాంటి వాఖ్యలు చేయించడం గమనార్హం. రామచంద్రయ్య తిరుపతిలో ఈ వాఖ్యలు చేస్తున్నప్పుడు ఆ సమయంలో చిరంజీవి కూడా తిరుపతిలో ఉండడం విశేషం. అంతేగాకుండా తిరుపతిని వదలి పెట్టే విషయంలో కూడా చిరంజీవి రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. తాను ఎప్పటికీ తిరుపతితో సంబంధాలు కలిగి ఉంటానని అంటున్నారు. అయితే గత శానస సభ్యులతో ఎవరితో పోల్చినా తిరుపతికి చిరంజీవి చాలా తక్కువనే చెప్పాలి. ఈ సారి ఆ అసంతృప్తికి కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Sunday 25 March 2012

తనయుడి కోసం గల్లా అరుణ ప్రయత్నం



చంద్రగిరి శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రి వర్యులు గల్లా అరుణ కుమారి తన కుమారుడికి తిరుపతి శాసన సభ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ పారిశ్రామికవేత్తగా పనిచేస్తున్నారు. పిన్న వయస్సులోనే పారిశ్రామిక వేత్తగా పేరు తెచ్చుకుంటున్న కుమారుడిని రాజకీయ నాయకుడిగా మార్చేందుకు ఆమె తన వంతు కృషి ఢిల్లిలో ఉండి లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తలు పొక్కాయి. ఇదే సీటు కోసం కాంగ్రెస్ నుండి మాజీ శాసన సభ్యులు వెంకటరమణ, మాజీ శాసన సభ్యుడు మబ్బు రామి రెడ్డి తనయుడు మబ్బు చెంగారెడ్డి, నవీన్ కుమార్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రజారాజ్యం తరపున గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర రెడ్డి పై గెలుపొందిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించడంతో శాసన సభ్యుడిగా రాజీనామా చేయనున్నారు. ఆ స్థానంలో జరుగనున్న ఎన్నికలు కావడంతో చిరంజీవి మాటకు విలువ ఉంటుందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి స్వంత జిల్లా చిత్తూరు కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారమే అభ్యర్థిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. గల్లా అరుణ కిరణ్ కుమార్ రెడ్డి తో మంచి రాజకీయ సంబంధాలు ఉండడంతో ఆమె తనయుడినే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో ఆర్థికంగా బలమైన అభ్యర్థి  తెలుగుదేశం పార్టీ కి అవసరమైంది. పార్టీని వదలి వెళ్ళిన  మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తిని తిరిగి పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం టిక్కేట్  ఇవ్వనుంది. వై.యస్.ఆర్ కాంగ్రెస్ తరపున కరుణాకర రెడ్డి అభ్యర్థిగా ఉంటారనే భావిస్తున్నారు. ఒక వేళ ఆయన పోటీ చేయకుంటే ఆయన శిష్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరికీ గెలుపు నల్లేరు పై నడక మాత్రం కాదు.

Thursday 22 March 2012

ఇక రాష్ట్ర రాజకీయాలలోనూ యూత్ దూకుడు...?


ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి కావడంతో మన రాష్ట్రంలోని చాలా మంది యువరాజకీయ నాయకులలో కూడా ఆశలు రేకెత్తిసున్నాయి. ముఖ్యమైన నాయకులకు వారసులుగా భావిస్తున్నవారు ఈ దిశగా తాము పదవులలోకి రావడానికి అప్పుడే వ్యూహరచనలు చేపట్టినట్టు తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా తిరుపతి శ్రీ విద్యానికేతన్ లో జరిగిన తన జన్మదిన వేడుకులకు హాజరయిన మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడును మోహన్ బాబు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తివేయడం, అదే విధంగా మోహన్ బాబు తనకు బంధువు మరియు మిత్రుడని రాజకీయాలలోకి వస్తే ఆహ్వానిస్తానని అనడంతో ఊహాగాహాలు చెలరేగాయి. అయితే వెంటనే తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న చిరంజీవి రాజ్యసభకు వెలుతుండడంతో అ సీటుకు తెలుగుదేశం తరపున మోహన్ బాబు కూతురు లక్ష్మీ పేరు తెరపైకి రావడం కూడా విశేషమే. అంటే వృద్దతరం నాయకుల స్థానంలో వారి కొత్తతరం భాద్యతలు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్టుగా కనిపిస్తోంది.అలాగే చిరంజీవి తన కుటుంబం తరపున ఆ సీటుకు ఎవరూ పోటీ పడడం లేదని ప్రకటించారు. అయితే అల్లు అరవింద్ , నాగబాబులు , ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన జగన్ వెంట యూత్  పడుతున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి యువకిరణాలు పేరిట ఓ పథకాన్నే నిర్వహిస్తుంటే, చంద్రబాబు యువజన సదస్సులు, బైక్ రేస్ లు నిర్వహించి యూత్ లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ జీవితం పై ఆశలతో ఉన్నారు. అయితే బాబాయితోనే అతనికి పేచీ వస్తోంది. చంద్రబాబు కుమారుడు రాజకీయంగా ప్రయత్నిస్తున్నప్పటికి అంతగా పట్టు సాధించలేక
పోతున్నాడనే చెప్పాలి. రాబోయే రోజులలో మాత్రం 2014 ఎన్నికలకు యూత్ తీసుకునే నిర్ణయం పైననే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పవచ్చు.

Wednesday 21 March 2012

ఉపఎన్నికల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది...


రాష్ట్రంలో ఉపఎన్నికల ఫలితాలు 90 శాతం మంది ఊహించినట్టుగానే ఉంది. రాజీనామా చేసిన వారే గెలువడం , తెలంగాణా కోసం వారి త్యాగానికి ప్రజలు కట్టిన పట్టాభిషేకం అనుకోవాలి. అయితే అదే సమయంలో బి.జె.పి మహబూబ్ నగర్ లో గెలువడం అంటే రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సూచనగా భావించవలసి ఉంటుంది. టి.ఆర్.యస్ గెలుపును మహబూబ్ నగర్ లో ఓటమి మచ్చగా మిగిలిపోతుంది. అంటే తెలంగాణా కోరుకునే పార్టీలు చీలిపోకుండా ఉండవలసిన అవసరం తెలుపుతున్నాయి. అంతేగాక కొవ్వూరు లో వైయస్ఆర్ కాంగ్రెస్ గెలుపు మాత్రం వారికి మరింత నైతిక బలాన్ని అందించబోతుంది. ఒక విధంగా ఎన్నికలకు ముందుగా జగన్ ను అరెస్టు చేస్తే ఆ ప్రభావం ఎన్నికలపై సానుభూతి ఉండవచ్చన్న అవకాశాలు లేకుండా  ఆ గెలుపు ఆ పార్టీకి ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డికి రాజకీయ జీవితం నిలిపినట్టేగా భావించవలసి ఉంటుంది. అయితే ఈ ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా తిరస్కరించిన పార్టీలు కాంగ్రెస్ , తెలుగుదేశం లు . అవి ఓటమిని ముందుగానే ఊహించినట్టు చెప్పుకుంటున్నా.. ఎక్కడో ఒక దగ్గరయినా గెలుస్తే చాలనే వారి ప్రచారం సాగింది. అయినా ప్రజలు తిరస్కరించారంటే అందులో చాలా కారణాలు విశ్లేషించుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ లో నాయకత్వ లేమి, తెలుగుదేశం పై విశ్వసనీయతలేమి రెండు పరాజయానికి కారణాలుగా అవి తెలంగాణా విషయంలో చేస్తున్న దోబూచులాటకు చెంపపెట్టుగా భావించవలసి ఉంటుంది.
రాబోయే కాలంలో టి.ఆర్.యస్ ఇటు బి.జె.పి కి దూరంగా, కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ ఏ విధంగా తెలంగాణాను సాధిస్తారో ఆలోచించుకోవాలి. వచ్చే ఎన్నికలనాటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత తీసికట్టుగా మారే అవకాశం ఉంది. ఈ లోపు అక్రమ కేసులలలో సి.బి.ఐ కేసులో జగన్ అరెస్టు అయితే ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. సానుభూతిగా మారితే ఓట్ల వర్షం లేకుండా భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అలాగే తెలుగుదేశం కూడా ఆలోపు ప్రజలలో విశ్వసనీయత పెంచుకునే దిశగా అడుగులు వేయకపోతే మరింత అగాథంలోకి కూరుకుపోతుంది. ఈ పరిస్థితులే వస్తే కాంగ్రెస్ కు మూడో స్థానమే నని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పార్టీ తెలంగాణాకు జైకొట్టి వారి మద్ధతు తీసుకుంటే వారిది నల్లేరు పై నడక అవుతుంది. కాని రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఉప ఎన్నికలలో లాగా ఓటర్లు ఆలోచిస్తారని చెప్పలేము. అయితే వారు ఇచ్చిన షాక్ కు ఇటు ప్రతిపక్షం, అటు ప్రభుత్వం మేలుకుంటాయోమే చూద్దాం.