Sunday 25 March 2012

తనయుడి కోసం గల్లా అరుణ ప్రయత్నం



చంద్రగిరి శాసన సభ్యురాలు, రాష్ట్ర మంత్రి వర్యులు గల్లా అరుణ కుమారి తన కుమారుడికి తిరుపతి శాసన సభ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ పారిశ్రామికవేత్తగా పనిచేస్తున్నారు. పిన్న వయస్సులోనే పారిశ్రామిక వేత్తగా పేరు తెచ్చుకుంటున్న కుమారుడిని రాజకీయ నాయకుడిగా మార్చేందుకు ఆమె తన వంతు కృషి ఢిల్లిలో ఉండి లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తలు పొక్కాయి. ఇదే సీటు కోసం కాంగ్రెస్ నుండి మాజీ శాసన సభ్యులు వెంకటరమణ, మాజీ శాసన సభ్యుడు మబ్బు రామి రెడ్డి తనయుడు మబ్బు చెంగారెడ్డి, నవీన్ కుమార్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రజారాజ్యం తరపున గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర రెడ్డి పై గెలుపొందిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఆయనకు రాజ్యసభ సీటు కేటాయించడంతో శాసన సభ్యుడిగా రాజీనామా చేయనున్నారు. ఆ స్థానంలో జరుగనున్న ఎన్నికలు కావడంతో చిరంజీవి మాటకు విలువ ఉంటుందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి స్వంత జిల్లా చిత్తూరు కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారమే అభ్యర్థిని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. గల్లా అరుణ కిరణ్ కుమార్ రెడ్డి తో మంచి రాజకీయ సంబంధాలు ఉండడంతో ఆమె తనయుడినే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో ఆర్థికంగా బలమైన అభ్యర్థి  తెలుగుదేశం పార్టీ కి అవసరమైంది. పార్టీని వదలి వెళ్ళిన  మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తిని తిరిగి పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం టిక్కేట్  ఇవ్వనుంది. వై.యస్.ఆర్ కాంగ్రెస్ తరపున కరుణాకర రెడ్డి అభ్యర్థిగా ఉంటారనే భావిస్తున్నారు. ఒక వేళ ఆయన పోటీ చేయకుంటే ఆయన శిష్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరికీ గెలుపు నల్లేరు పై నడక మాత్రం కాదు.

No comments:

Post a Comment