Thursday 7 June 2012

రాజీనామా చేసి మళ్ళీ పోటీ మంచిదేనా..



ఐదేండ్లు పదవీలో ఉండేందుకు ఏదో ఒక పార్టీ తరపున ప్రజలు ఎన్నుకుంటే తెలంగాణా అంశమో లేదా పార్టీలో తమ నాయకుడికి అనుకూలంగా లేదని అసంతృప్తితోనూ , తమకు మంత్రి పదవి రాలేదనో, మరో పార్టీలో చేరితే మంచి పదవులు వస్తాయనో కొందరు రాజీనామాలు చేసి మళ్ళీ వెంటనే పోటీ చేస్తున్నారు. దీనికి వారు పెట్టుకున్న పేరేమిటంటే ప్రజాభిప్రాయం అనో , సెంటిమెంటు అనో పేరు పెట్టుకుంటున్నారు. ప్రజలు కూడా ఎక్కువ శాతం వీరేదో తమకోసమో రాజీనామా చేసినట్టు భావించి మళ్ళీ ఎన్నుకుంటున్నారు. ఈ విధంగా గత 6 సంవత్సరములలో 65 స్థానాలకు ఎన్నికలు జరిగాయంటేనే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిందో తెలుస్తుంది. దీనివల్ల ఏమైనా సాధించారా అంటే తమకు ప్రజలలో పలుకుబడి ఉందని నిరూపించుకోవడం తప్ప ఇంకేమి కనబడదు. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని ఇటీవల పరకాలలో బి.జె.పి పిలుపు నిచ్చింది. అంతేగాక టి.ఆర్.యస్. రాజీనామాలు చేసి తెలంగాణా సాధించలేదని ఎద్దేవా చేసింది. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అటు కె.సి.ఆర్, ఇటు జగన్ లు రాజీనామాలు చేయించి అనవసరమైన ఉపఎన్నికలు తెస్తున్నారని, ఇలా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయనీయకుండా కనీసం పదేళ్ళు నిషేధం ఉండాలని డిమాండు చేశారు. అసెంబ్లీ స్పీకరు నాదెండ్ల మనోహర్ ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ ఏదైనా కారణం వల్ల రాజీనామా చేసిన వారు కొంతకాలం వరకు పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చే విషయం పై చర్చలు జరుగుతున్నాయని అలాంటి చట్టం అవసరం ఉందని చెప్పారు. ప్రజల సొమ్మును, కాలాన్ని హరించే రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికలో పాల్గొనే వారి పట్ల ఏదో ఒక చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. లేదంటే రాబోయే కాలంలో ఇదొక ఆటలా మారిపోయి , డబ్బులకు అమ్ముడయ్యే వారి సంఖ్య పెరిగి పోతుంది. 

3 comments:

  1. ఆలోచించాల్సిందే. ప్రతిపక్షం అధికార పక్షం తో కలిసి పొతే ఎటువంటి శిక్ష ఉండాలో కూడా మీరే నిర్ణయించండి.

    ReplyDelete
  2. భాస్కరరావుగారూ మీ ఆక్షేపణ అసలు విషయానికి సంబంధం లేకుండా ఉంది.
    తరచూ ఉపయెన్నికలు అనేవి ప్రజాధనం దుర్వినియోగం కావటానికి కారణమౌతున్నాయి. ఇందులో సందేహం లేదు. అలాగే పరిపాలన అనేది కుంటుబడెలా చేస్తున్నాయన్నదీ నిస్సందేహమే.

    చట్టసభనుండి ఐఛ్ఛికంగా రాజీనామా చేసిన వారికి వచ్చే సాదారణ యెన్నికలు కాక ఆపై వచ్చే సాధారణ యెన్నికల సమయందాకా మరే పార్టీ తరపునా, వ్యక్తిగతంగానూ పోటీ చేసేందుకు అర్హతను రద్ధు చేయాలి. అలాగే చట్టసభకు ఒక పార్టీ ద్వారా యెన్నికై ఆ పార్టీనుండి బహిష్కృతులైతేకూడా అదే శిక్ష విధించాలి. ఇలాగైతే తమాషా రాజీనామాలనూ ఆయారాం-గయారాం ఫిరాయింపుదార్లనూ అదుపుచేయవచ్చును.

    ReplyDelete
  3. ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్య వ్యతిరేకం. రాజినీమా చేసిన అభ్యర్తులు తిరిగి గెలిచి తమ వాదన యొక్క ప్రజామోదాన్ని చాటుకున్నారు.

    ప్రజాప్రతినిదులని వెనక్కు తీసుకొనే హక్కు (right to recall) ప్రస్తుతం మనకు లేదు. ఆ హక్కు ఉండి ఉంటె చాలా మందికి (ఉ. తెలంగాణా కాంగ్రెస్ తెదేపా ప్రతినిధులకు) నూకలు చెల్లేవి. వచ్చేసారి ఎటు తిరిగీ గెలిచే అవకాశం లేని వీరు right to recall లేకపోవడం వల్ల ఇంకా పదవులు వెలగబెడుతున్నారు.

    పదేళ్ళు నిషేధం వచ్చినా ఒరిగేది ఏముంది? రాజీనామా చేసిన వ్యక్తి బదులు అదే వాదనను బలపరిచే మరో అభ్యర్తి గెలవకుండా ఆపగలరా? తమ పార్టీ పునాదులు ఎగిరిపోతున్న శోకంలో బాబుకు ఎం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. వారు తమ ఎన్నికల మానిఫెస్టోకు కట్టుబడి ఉంటె ఇన్ని కష్టాలు వచ్చేయా?

    కేంద్ర చట్టాలలో మార్పు తెచ్చే సీను నాదెండ్ల మనోహర్ గారికి ఉందా? మైకు దొరికిందని ఉపన్యాసాలు దంచడం సరి కాదు.

    ఒక్కో వ్యక్తి రెండేసి (Chiru) మూడేసి (NTR) స్తానాలలో పోటీ చేసి ప్రజాధనం బూడిదలో పోసినప్పుడు గుర్తు రాని "సమస్య" ఇప్పుడు ఎందుకు తెస్తున్నారో ఊహించుకోలేనంత విషయం కాదు.

    ReplyDelete