Friday 15 June 2012

జగన్ పార్టీ జయకేతనం



అందరూ ఊహించినట్టే జరిగింది. 12 వతేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వై.యస్.ఆర్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 మరియు ఎన్నికలు జరిగిన ఒకే ఒక లోకసభ స్థానంలోనూ ఆపార్టీ గెలుపొందడం జరిగింది. అదే విధంగా తెలంగాణా ప్రాంతానికి చెందిన పరకాలలో కూడా తృటిలో ఓడినా గెలిచినంత పనిచేసి టి.ఆర్.యస్ కు చుక్కలు చూపించింది. జగన్ పార్టీ గెలుపుపై ఎవరికీ సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీ నిలబెట్టిన వారంతా సిటింగ్ యం.ఎల్.ఏలు . అయితే వాటిలో అన్ని స్థానాలు గెలిచి సత్తా చాటాలని ప్రయత్నించినా కాంగ్రెస్ రెండు స్థానాలలో అడ్డుకోగలిగింది. అలాగే తెలుగు దేశం దాదాపు 10 స్థానాలలో కాంగ్రెస్ కన్నా ముందున్నా ఒక సీటు కూడా దక్కలేదు. ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఆశనిపాతమే.  ఈ ఎన్నికల అంశంగా మారిన జగన్ అవినీతి కన్నా ఆయనను అరెస్టు చేయడం తల్లి, చెల్లి, కన్నీరు, లాంటి సానుభూతి అంశాలు ఎక్కువగా పనిచేశాయి. దీనికి ఉదాహరణగా పరకాలను చెబుతున్నారు. టి.ఆర్.యస్ సులభంగా ఎక్కువ మెజారిటీతో గెలవాలసిన స్థానంలో చెమటోడ్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సానుభూతి పవనాల వల్లే ప్యాన్ గుర్తుకు అన్ని ఓట్లు పడ్డాయని టి.ఆర్.యస్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ జైలులో ఉన్నా ఆ పార్టీ గెలుపొందడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి ఇదే సానుకూలంగా ఉపయోగపడిందని వేరే చెప్పనక్కరలేదనుకుంటా..

No comments:

Post a Comment