Tuesday 5 June 2012

తేజం తగ్గుతున్న తెలుగుదేశం


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే గాకుండా భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా 1983 లో ఒక ఉత్తుంగ తరంగమై, సామాజిక చైతన్యమై ఎగిసిపడి ఆవిర్భావంలోనే తాను తొమ్మిది నెలల పసికందుగా ఎదుర్కొన్న తొలి ఎన్నికలలోనే కాంగ్రెస్ పై అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించి తెలుగుదేశం తేజం రాను రాను తగ్గిపోతున్నది.

తెలుగు దేశం 1983 లోను 1985 లోనూ విజయం సాధించి 1989 లో ఓటమి చవిచూసింది. తిరిగి 1995 లోను, 1999 లోనూ విజయం సాధించింది. అలాగే 2004,2009 ఎన్నికలలో ఓటమి చెంది నీరసించి పోయింది. వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ పార్టీలో మునుపటి వాడి వేడి కనిపించడం లేదు.  పార్టీ అరంభించిన తొలి నాళ్ళలో అంతా కొత్తవారైనా ఎన్టీఆర్ సినీ గ్లామర్ మరియు ఆయన వాగ్దాటి పార్టీ వైపు జనాన్ని తెలుగుదేశం పిలుస్తోంది రా రమ్మని స్వాగితించాయి. బడుగు బలహీన వర్గాలకు అండంగా విద్యావంతులకు, యువకులకు ఎక్కువ సీట్లు కేటాయించి విజయ దుందిబి మ్రోగించింది. సంవత్సరం తిరగకుండానే నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తరువాత పదవీ నుండి తప్పిస్తే నేలకు కొట్టిన బంతిలా నెల తిరుగకుండానే తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తరువాత  అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు పోయి తిరిగి విజయం సాధించారు.దీంతో ఆయన వైఖరిలో నియంతగా వచ్చిన మార్పుల కారణంగా ఒకేసారి కేబినెట్ లో 30 మంది మంత్రులను రాజీనామా చేయించడం తది తర నిర్ణయాలతో 1989 లో ఓటమి చవిచూశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలుగుదేశం 1995 లో విజయం సాధించింది. అప్పుడు పార్టీలో వివిధ వర్గాలు ఉన్నా రామారావు తిరిగి కేడర్ లో నమ్మకం నిలిపి కాంగ్రెస్ పై అఖండ విజయం సాధించారు. అంతేగాక నేషనల్ ప్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై వి.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం మనే చెప్పాలి. ప్రతిపక్షనేతలను కలిపి రామారావు దేశ రాజకీయాలలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
 లక్ష్మీ పార్వతి ప్రవేశంతో పార్టీలో అసమ్మతి మొదలై తుదకు రామారావునే ఆ పార్టీ నుండి తొలగించి చంద్రబాబు నాయుడు 1995 లో ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మృతి చెందడంతో బాబు తెలుగుదేశం పూర్తి స్థాయి తెలుగు దేశంలా మారింది. చంద్రబాబు  తన ఇమేజ్ ను పెంచుకొని శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి లాంటి విన్నూత కార్యక్రమాలు చేపట్టి అందరి మన్నలను పొందారు. ఆకస్మిక తనిఖీలు చేయడం, మహిళా డ్వాక్రా సంఘాల ఏర్పాటు దానికి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం, నీరు-మీరు లాంటి సామాజిక అవగాహనా కార్యక్రమాలు చేపట్టి 7 సంవత్సరముల కరువు సమయంలోనూ ప్రజలకు ప్రభుత్వం ఉందనే హామిని ఇవ్వగలిగారు. ఈ సమయంలోనే ప్రభుత్వంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి ప్రభుత్వ నష్టాలను చాలా భాగం తగ్గించి వేశారు. అంతేగాకుండా సైబరాబాద్ లో హైటెక సిటీ ఏర్పాటు వల్ల హైదరాబాదు కు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే గాకుండా నిరుద్యో సమస్య చాలా భాగం తీరిందనే చెప్పవచ్చు.  కేంద్రంలో రాజకీయ ప్రభావం చూపి రాష్ట్రపతి, స్పీకరు అభ్యర్థుల ఎంపికలోనూ, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపికలోనూ కీలక పాత్ర  పోషించడం జరిగింది. అయితే రెండవసారి వాజ్ పాయ్ ప్రభుత్వంతో ఉన్నసంబంధంతో బి.జె.పి పొత్తుతో ఎన్నికలు గెలవడంతో ఆయన తీరులో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. అంతవరకు అందరినీ కలుపుకొని పోయిన బాబు ఆ తరువాత అందరినీ దూరం చేసుకుంటూ పోయారు. దీంతో పాటు కరువు వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా తయారయింది. ఇదే సమయంలో పాదయాత్ర చేసి, రైతులకు ఉచిత కరెంటు హామీని ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఉద్యోగులు, రైతులు దూరంకావడంతో ఆ ఎన్నికలలో ఓటమిపాలయి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. ఇక 2009 ఎన్నికలలో అయితే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నంత హడావుడి జరిగింది. మహా కూటమి ఏర్పాటు చేయడంతో పాటు టి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకొని బాగానే ప్రచారం చేసుకున్నా చిరంజీవి ప్రజారాజ్యం
పార్టీ పెట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ఆ ఎన్నికలలో తిరిగి  తెలుగుదేశం ఓటమి చవిచూడవలసి వచ్చింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ బోటాబోటీ  మెజారిటీతో గెలుపొందడం జరిగింది.ఆ తరువాత ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పనులను తూర్పారబట్టినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆపరేషన్ ఆకర్ష, ప్రజారాజ్యం ఏర్పాటు వల్ల, తెలంగాణా సమస్య వల్ల చాలామంది నాయకులు పార్టీని వీడినా కేడర్ మాత్రం పార్టీనే అంటి పెట్టుకుని ఉంది. అయితే ఆ పార్టీకి జిల్లా స్థాయిలో నడిపించే నాయకులే కరువయ్యారు. నాయకులు తమ స్వంత వ్యాపారాలు చూసుకుంటూ పార్టీ పనిని పార్ట్ టైం పనిగా చేసుకన్నారనే చెప్పాలి. ఎన్నికలప్పుడు మాత్రమే హడావుడి చేసే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఓటమికి బాబును మాత్రమే భాద్యత చేసి పార్టీలో ఉంటూనే తాము వ్యతిరేకంగా పనిచేస్తుండడం విశేషం.  రాజశేఖర్ రెడ్డి మృతి తరువాత కూడా ఆ పార్టీ తెలంగాణాలోనూ ఇటు రాయలసీమ, కోస్తాలోనూ ఎదురీదుతున్నది. తెలంగాణాలో టి.ఆర్.యస్. తో ఇబ్బంది కర పరిస్థితులు వస్తుంటే మిగిలిన ప్రాంతాలలో జగన్ ను ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారుతోంది. దేశంలోనే జగన్ అక్రమాస్తుల కేసకు పెద్ద అవినీతి అని తెలిసినా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా పార్టీ కేడర్ లో మాత్రం నాయకత్వంపై నమ్మకం సడలినట్టు కనపడుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వరుస ఓటములు, జిల్లా స్థాయిలో నాయకుల మధ్య కుమ్ములాటలు ఒక ప్రక్క మరో ప్రక్క పార్టీకి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నట్టు సమాచారం. అందువల్ల చంద్రబాబు ఒక్కడి పైననే భారం పడుతోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం బలహీనంగా ఉందని కూడా బలంగా చెప్పవచ్చు. దీంతో రాబోయే కాలంలో ఆ పార్టీ తిరిగి పుంజుకోవాలంటే ఎదుటి వారి బలహీనతలపై ఆశలు పెట్టుకొని ఉంది. ఈ ఎ న్నికలు తెలుగుదేశం తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం.

2 comments:

  1. చిరంజీవి వార్టీ పెట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోయి కాంగ్రెసు స్వల్ప మెజారిటీ తో గెలవడం జరిగింది అన్నారు..తొమ్మిదేళ్లు పరిపాలన చేసిన ప్రభుత్వం తాము చేసిందేమటో చెప్పుకోలేక ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆధారపడిఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి,ఇప్పటికైనా కోర్టు కేసుల్లో భయపడి స్టేలు తెచ్చుకోకుండా విచారణలు జరిగి తన సఛ్ఛీలతను చాటుకుని ఉంటే జనంలో ఒక విలువంటూ ఉండేది.జనంలో విశ్వాసం కోల్పోయిన వారు ఎవరిగురించే ఏమి చెప్పినా ప్రజలు నమ్మరు. ఎమ్మార్ ఎమ్.జీ.మ్ లకు వందల ఎకరాలను కట్టబెట్టడంలోవేల కోట్ల ప్రజేాధనం దోచిపెట్టబడలేదని నిరూపించుకుంటే ప్రజలు ఆయన పార్టీని గెలిపిస్తారు.ఇప్పుడు కూడా జగన్ కేసుని సాకుగా తీసుకుని తమకు ఒటేయమని అడగాల్సి రావడం ఆ పార్టీ దౌర్బాగ్యం (జగన్ కేసుని సాకుగా ఆని ఎందుకన్నానంటే ఆ కేసు కోర్టులో నడుస్తోంది.నిజనిరూపణ జరిగి శిక్ష వేయాలసినది కోర్టు కాని రాజకీయ ప్రత్యర్థులు కాదు.దీనర్థం జగన్ నిర్దోషి ఆని అంతకన్నా కాదు.కాని కిట్టని పార్టీలు పత్రికలూ వేసే పద్నాలుగేళ్ళ శిక్షలూ ఉరి శిక్షా చెల్లవని మాత్రమే.

    ReplyDelete
  2. త్వరలో ఈ డబ్బా తెలుగు దేశం పార్టీ మూత పడుద్ది. ఇంకొక పది రోజుల్లో మీకు విషయం పూర్తిగా అర్ధం అవుతుంది

    ReplyDelete